టూర్ ముగిసింది.. ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు CM కేసీఆర్

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ టూర్ ముగిసింది. ఈ మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఆయన ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు బయల్దేరారు. 25వ తేదీన ఢిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్… 28న పర్యటన ముగించారు. ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీని కలిశారు. సెక్రటేరియట్ నిర్మాణం కోసం బైసన్ పోలో భూములు కేటాయించాలని… కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా సహా 16 అంశాలపై ప్రధానికి మెమొరాండం ఇచ్చారు. ఎస్సీలను వర్గీకరించాలని… 9,10 షెడ్యూల్ లోని పెండింగ్ అంశాలను పరిష్కరించాలని కోరారు. వరంగల్ కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ కోసం రూ.వెయ్యి కోట్ల సాయం, జహీరాబాద్ నిమ్జ్ కోసం నిధులు, వరంగల్ గిరిజన విశ్వవిద్యాలయం పెట్టాలని కోరారు. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తోనూ సమావేశం అయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో సమావేశమయ్యారు కేసీఆర్. కారు గుర్తును పోలి ఉండే ట్రక్కు, హ్యాట్, ఇస్త్రీపెట్టె లాంటి గుర్తులను వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఎవరికీ కేటాయించవద్దని.. కారు గుర్తు రంగును పెంచాలని కేసీఆర్.. సీఈసీ సునీల్ అరోరాను కోరారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ లతో సమావేశం షెడ్యూల్ లో ఉన్నా.. కేసీఆర్ వారిని కలవలేదు.

అంతకు ముందు డిసెంబర్ 23వ తేదీన ఏపీ, ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో పర్యటించారు కేసీఆర్. ప్రత్యేక విమానంలో కేసీఆర్ కుటుంబం 23న వైజాగ్ వెళ్లింది. అక్కడ శారదాపీఠంలో స్వామి స్వరూపానందేంద్ర ఆధ్వర్యంలో రాజశ్యామల గుడిలో పూజలు చేశారు కేసీఆర్. తర్వాత కేసీఆర్ భువనేశ్వర్ వెళ్లి ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ను కలిశారు. ఫెడరల్ ఫ్రంట్ పై చర్చించారు. కోణార్క్, పూరీ జగన్నాథ ఆలయాలను సందర్శించారు. అక్కడినుంచి కోల్ కతా వెళ్లిన చంద్రశేఖర్ రావు.. మమతా బెనర్జీతో ఫ్రంట్ ఏర్పాటుపై చర్చించారు. కాళీమాత దర్శనం తర్వాత ఢిల్లీ వెళ్లారు కేసీఆర్.

Posted in Uncategorized

Latest Updates