ట్రంప్​కు చిన్న కూతురు షాక్.. నిరసనలకు మద్దతు

న్యూఢిల్లీ: జార్జి ఫ్లాయిడ్ మరణం పట్ల అమెరికాలో నిరసనలు హోరెత్తుతున్నాయి. ఫ్లాయిడ్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ వేలాది మంది ప్రజలు రోడ్డెక్కుతున్నారు. నిరసనకారులు లూటీలు, విధ్వంసాలకు పాల్పడుతుందటంతో ప్రెసిడెంట్ ట్రంప్ సైన్యాన్ని దించుతామని హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ట్రంప్ కు ఇంట్లోనే షాక్ కొట్టింది. ట్రంప్ చిన్న కూతురు టిఫానీ సోషల్ మీడియాలో స్పందించారు. పోలీసు చర్యలు హేయమైనవంటూ గురువారం ట్వీట్ చేశారు. ప్రభుత్వ వైఖరి పట్ల నిరసనలకు మద్దతుగా బ్లాక్ కలర్ స్క్రీన్ ఫొటోను ఇన్​స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ‘‘సింగిల్ గా ఉంటే ఫలితం తక్కువే.. కానీ కలిసి కొట్లాడితే ఏదైనా సాధించగలం” అన్న అమెరికన్ రైటర్ హెలెన్ కిల్లర్ మాటలను ఆమె పోస్ట్ చేశారు. టిఫానీ తల్లి మార్లా మాపుల్స్ కూడా నిరసనలకు సంఘీభావంగా అదే బ్లాక్ ఫోటోను పోస్ట్ చేశారు. ఓ పోలీసు ఎనిమిది నిమిషాల పాటు మెడపై మోకాలితో నొక్కడంతో జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడు మరణించాడు. దీనిపై యూఎస్ అంతటా నిరసనలు చెలరేగాయి. గురువారం జరిగిన నిరసనలలో వందలాది షాపులు దెబ్బతిన్నాయి, ఒక పోలీస్ స్టేషన్​కు నిప్పంటించారు.

Latest Updates