ట్రంప్‌కు షాక్ : రాజీనామా చేసిన రక్షణ మంత్రి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలను సొంత పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారు. సిరియా నుండి సైనిక దళాలను ఉపసంహరిస్తూ తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆ నిర్ణయాన్ని అమెరికా రక్షణ మంత్రి జిమ్‌ మాటిస్‌ వ్యతిరేకించారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య అభిప్రాయబేధాలు వచ్చాయి. దీంతో మాటిస్‌ తన పదవికి నిన్న(గురువారం) రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. సలహాదారుల సూచనలను అసలు పట్టించుకోకుండా… సిరియా నుంచి అమెరికా దళాలను ఉపసంహరించాలని ట్రంప్‌ నిర్ణయించిన మరుసటి రోజే ఈ ఘటన జరిగింది.

ట్రంప్‌తో మాటిస్‌ భేటీ తర్వాత…ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో రాజీనామా చేయనున్నట్టు మాటిస్‌ ప్రకటించారని వైట్‌హౌస్‌ వర్గాలు తెలిపాయి. ట్రంప్‌ ఒత్తడి కారణంగానే మాటిస్‌ రక్షణ మంత్రి బాధ్యతల నుంచి తప్పుకున్నారనే వార్తల్లో నిజం లేదని అమెరికన్‌ అధికారి స్పష్టం చేశారు. సిరియాపై ట్రంప్‌ నిర్ణయంతో విభేదించినందునే మాటిస్‌ తన పదవి నుంచి తప్పుకున్నారని మరికొందరు చెబుతున్నారు.

వాస్త‌వానికి మాటిస్ ఫిబ్ర‌వ‌రిలో రిటైర్ కానున్న‌ట్లు ట్రంప్ ఇటీవ‌ల ఓ ట్వీట్ చేశారు. కూట‌మి దేశాల సైన్యాన్ని ఒక ద‌గ్గ‌ర‌కు చేర్చ‌డంలో మాటిస్ కీల‌క పాత్ర పోషించార‌ని ఆయ‌న‌ అన్నారు. అయితే మాటిస్ స్థానంలో మ‌రో వ్య‌క్తిని నియ‌మించ‌నున్న‌ట్లు ట్రంప్ తెలిపారు. కానీ ఆ వ్య‌క్తి ఎవ‌ర‌న్న విష‌యాన్ని తెలపలేదు.

Posted in Uncategorized

Latest Updates