ట్రంప్ కు మద్దతుగా అమెరికాలోని భారతీయుల ర్యాలీ

Indians-at-white-houseప్రతిభ ఆధారిత ఇమ్మిగ్రేషన్ విధానాన్ని తీసుకురావాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయానికి మద్దతుగా ర్యాలీ నిర్వహించారు అమెరికాలోని భారతీయులు. వాషింగ్టన్‌లోని శ్వేతసౌధం ముందు శనివారం నిర్వహించిన ఈ ర్యాలీలో భారతీయ అమెరికన్లు ప్లకార్డులతో ట్రంప్‌కు మద్దతు తెలిపారు. ర్యాలీలో పాల్గొన్నవారిలో ఎక్కువమంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే ఉన్నారు. తమ దేశాన్ని ప్రేమించేవారు, గౌరవించేవారు, తమ సమాజం కోసం పాటు పడేవారు, ప్రతిభావంతుల కోసం ప్రతిభ ఆధారిత ఇమ్మిగ్రేషన్ విధానాన్ని తీసుకురానున్నట్లు, లాటరీ వీసా వ్యవస్థకు తాను ముగింపు పలుకబోతున్నట్లు గతవారం కాంగ్రెస్ ఉభయసభలనుద్దేశించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రసంగం పట్ల హర్షం ప్రకటించారు భారతీయ అమెరికన్లు.

ప్రతిభ ఆధారిత ఇమ్మిగ్రేషన్‌ పట్ల హర్షం

గ్రీన్ కార్డు కోసం వేచిచూస్తున్న అమెరికాలోని అనేక మంది భారతీయ కుటుంబాలు శ్వేతసౌధం ముందు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నాయి. వీసా పరిమితి ఎత్తివేయాలని, ప్రతిభ ఆధారిత ఇమ్మిగ్రేషన్‌కు తాము మద్దతు తెలుపుతున్నామని ప్లకార్డులను ప్రదర్శించారు. ప్రతిభ ఆధారిత ఇమ్మిగ్రేషన్ అమలు కోసం మేం ఎదురుచూస్తున్నాం. ఎంతోమంది గ్రీన్‌కార్డు కోసం వేచిచూస్తున్న ప్రతిభావంతులైన భారతీయ అమెరికన్లకు ఇది తోడ్పడుతుంది. ఈ విధానం అమెరికా శ్రేయస్సుకు, ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది అని రిపబ్లికన్ హిందూ అలయెన్స్ పొలిటికల్ డైరెక్టర్ కృష్ణా బన్సాల్ అభిప్రాయపడ్డారు. ట్రంప్ తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అమెరికాలో శాశ్వతం నివాసం ఏర్పరచుకునేందుకు వేచిచూస్తున్న అనేక మంది ప్రతిభావంతులైన భారతీయులకు మార్గం సుగమం కానుందని పలువురు భావిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates