ట్రంప్ మరో షాక్.. సిరియా నుంచి యూఎస్ బలగాలు వెనక్కి

అనూహ్య నిర్ణయాలకు కేరాఫ్ అయిన యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. సిరియాలో ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులతో యుద్ధం ముగిసిందని అకస్మాత్తుగా తన నిర్ణయాన్ని ప్రకటించారు. సిరియాలో ఐఎస్ఐఎస్ పై అమెరికా విజయం సాధించింది అని బుధవారం నాడు అధికారికంగా స్టేట్ మెంట్ ఇచ్చారు. ఇపుడు అమెరికా యువ వీరులను వెనక్కి పిలిపించాల్సిన సమయం వచ్చిందని చెప్పాడు. బలగాలను అమెరికా తిరిగి రావాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. సిరియా పునర్నిర్మాణంలో భాగంగా ఆపరేషన్ నెక్స్ట్ ఫేజ్ ఇకనుంచి మొదలవుతుందని చెప్పారు ట్రంప్.

ఉత్తర సిరియాలోని కుర్దిష్ ప్రాంతంలో.. ప్రస్తుతం 2వేల అమెరికా ట్రూప్స్ ఉన్నాయి. మరో ఆరు నెలల పాటు సిరియాలో అమెరికా బలగాలు ఉంటాయని యూఎస్ ప్రభుత్వం మొన్నటివరకు సూచనలు ఇచ్చింది. ఆ దేశంలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకిలించేంతవరకు అమెరికా… సిరియా వెంట ఉంటుందని చెబుతూ వచ్చింది. ఐతే… సిరియా నుంచి అమెరికా బలగాలను వెనక్కి పిలిపిస్తూ.. డిసెంబర్ 19న సడెన్ గా తన నిర్ణయాన్ని ట్రంప్ ప్రకటించడంతో యూఎస్ కు మద్దతుగా నిలిచిన అక్కడి కుర్దులు, రష్యా, ఇతర దేశాలు ఇపుడు ఇరకాటంలో పడ్డాయి.

సిరియా డెమక్రటిక్ ఫోర్సెస్ (SDF)- అరబ్ ఫైటర్స్ బలగాలతో కలిసి అమెరికా ..  ఇస్లామిక్ స్టేట్ పై ఇన్నాళ్లూ యుద్ధం చేసింది. సిరియాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను పూర్తిగా అణచేయలేదని.. అమెరికా తమ యుద్ధాన్ని మధ్యలోనే ఆపేస్తే… ఈ దేశం మళ్లీ ఐస్ఐఎస్ చేతిలోకి వెళ్తుందని సిరియా డెమక్రటిక్ ఫోర్సెస్ అంటోంది. ఇది రాజకీయంగా.. మిలటరీ యాక్షన్ పరంగా ఓ శూన్యాన్ని మిగిల్చినట్టు అవుతుందని చెప్పింది.

ఐతే.. అమెరికా బలగాలను వెనక్కి రప్పించడంలో సర్ ప్రైజ్ ఏమీ లేదంటున్నారు ప్రెసిడెంట్ ట్రంప్. సిరియాలో ఎక్కువ కాలం బలగాలను ఉంచలేమని.. ఆరు నెలల కిందట కూడా తాను చెప్పానన్నారు. రష్యా, ఇరాన్, సిరియా లాంటివి.. మిడిల్ ఈస్ట్ లో ఇస్లామిక్ స్టేట్ కు లోకల్ శత్రువులని ట్రంప్ చెప్పారు. వాళ్లతో పాటు ఇన్నాళ్లు పోరాటం చేశామని… ఇపుడు పునర్నిర్మాణం మొదలు కావాల్సి ఉందన్నారు ట్రంప్.

Posted in Uncategorized

Latest Updates