ట్రక్కు, హ్యాటు, ఇస్త్రీపెట్టె గుర్తులు ఎవరికీ ఇవ్వొద్దు.. సీఈసీకి కేసీఆర్ రిక్వెస్ట్

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. ఇవాళ గురువారం మధ్యాహ్నం ఢిల్లీలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరాతో సమావేశం అయ్యారు. ఆయనతోపాటు ఎంపీలు వినోద్, బండ ప్రకాశ్ ముదిరాజ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించే కొన్ని గుర్తులపై అభ్యంతరం తెలుపుతూ సీఈసీకి ఓ వినతిపత్రం ఇచ్చారు సీఎం కేసీఆర్. టీఆర్ఎస్ పార్టీకి ఈసీ కేటాయించిన కారు గుర్తును పోలి ఉన్న గుర్తులను వేరే ఏ పార్టీకి, ఇతర అభ్యర్థులకు కేటాయించవద్దని ముఖ్యమంత్రి సీఈసీని కోరారు. ముఖ్యంగా.. ట్రక్కు, హ్యాట్, కెమెరా, ఇస్త్రీపెట్టె గుర్తులు కారును పోలినట్టుగానే ఉంటాయని… వీటిని మరెవరికీ కేటాయించవద్దని కేసీఆర్ రిక్వెస్ట్ చేశారు. కంటిచూపు తక్కువగా ఉన్నవారు ఈ గుర్తులను కారు గుర్తులుగా భావించి ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉన్నందున ఓటర్లకు ఈ సమస్య రాకుండా చూడాలని విజ్ఞప్తిచేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమ పార్టీకి చెందిన కొందరు అభ్యర్థులపై ఈ ప్రభావం కనిపించిందని .. ఓట్లు నష్టపోయినట్టుగా కేసీఆర్ .. సీఈసీకి వివరించారు. సీఎం విజ్ఞప్తిపై కేంద్ర ఎన్నికల కమిషన్ సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. ఓటర్ లిస్ట్ నుంచి కొన్ని పేర్లు తీసేయడం వల్ల తమ పార్టీ నష్టపోయిందని కేసీఆర్ ఈసీకి దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం.

CECతో కేసీఆర్ భేటీ వివరాలను మీడియాకు తెలిపారు ఎంపీ వినోద్. “చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరాను సీఎం కేసీఆర్ కలిశారు. ట్రక్కు, కెమెరా, ఇస్త్రీపెట్టె, హ్యాట్ గుర్తులపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తో సీఎం చ‌ర్చించారు. శాసన సభ ఎన్నికల్లో ట్రక్కు గుర్తుతో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్తులకు నష్టం జరిగింది. కారు గుర్తును పోలిన సింబల్స్ తో గ్రామీణ ఓటర్లు గందరగోళంలో పడుతున్నారు. 15 మంది అభ్యర్థులకు వెయ్యి నుంచి 15 వేల ఓట్ల నష్టం జరిగింది. ప్ర‌జా స్వామ్యంలో ఓట‌ర్ల‌కు అనుకూలంగా గుర్తులు ఉండాలి, ఓట‌ర్ల‌ను గంద‌ర గోళానికి గురి చేసేలా గుర్తులు ఉండొద్దని కోరాం. లోక్ సభ ఎన్నికల్లో కారును పోలిన గుర్తులను కేటాయించవద్దని సీఎం కేసీఆర్ కోరారు. కారు గుర్తు రంగును పెంచాలని కోరారు. త్వ‌ర‌లోనే కేంద్ర ఎన్నిక‌ల సంఘం భేటీ అయి నిర్ణ‌యం తీసుకుంటామని సీఈసీ సునిల్ అరోరా చెప్పారు” అని వివరించారు వినోద్.

Posted in Uncategorized

Latest Updates