ట్రిపుల్ తలాక్ బిల్లుకు లోక్ సభ ఆమోదం

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ట్రిపుల్ తలాక్ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. బిల్లుకు అనుకూలంగా 245 మంది, వ్యతిరేకంగా 11 మంది సభ్యులు ఓటేశారు. దీంతో బిల్లు పాస్ అయినట్టు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. అంతకుముందు ట్రిపుల్ తలాక్ బిల్లుపై లోక్ సభలో వాడీవేడీ చర్చ జరిగింది. చర్చ ప్రారంభంలో మాట్లాడిన కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్.. ట్రిపుల్ తలాక్ చక్రబంధంలో చిక్కుకున్న ముస్లిం మహిళలకు న్యాయం చేసేందుకే బిల్లు తీసుకొచ్చామని  చెప్పారు.

కాంగ్రెస్, MIM, టీడీపీ, తృణమూల్ కాంగ్రెస్ తో పాటు ఇతర ఎన్డీయేతర పార్టీలు బిల్లును వ్యతిరేకించాయి. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే  ప్రతిపక్షాలు బిల్లును అడ్డుకుంటున్నాయని రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. ట్రిపుల్ తలాక్ పాపమని ఖురాన్ లో కూడా ఉందని, సుప్రీంకోర్టు కూడా ఇదే విషయం చెప్పిందన్నారు. ఇక బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాల్సిందేనని.. చర్చ పూర్తయ్యాక ప్రతిపక్ష పార్టీలు మరోసారి డిమాండ్ చేశాయి. అయితే కేంద్రం దీనికి ఒప్పుకోలేదు. ఇదే సమయంలో కాంగ్రెస్, అన్నాడీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ సభ నుంచి వాకౌట్ చేశాయి. తర్వాత సవరణలపై ఓటింగ్ నిర్వహించగా.. అవన్నీ వీగిపోయాయి.

Posted in Uncategorized

Latest Updates