ట్విస్టుల మీద ట్విస్టులు : యువతి లవ్ మ్యారేజ్

LOVE GAMEప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి ఓ యువతి ఆడిన డ్రామాకు తల్లిదండ్రులతో పాటు పోలీసులు పరుగులు పెట్టారు. తనను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని.. అత్యాచారానికి పాల్పడ్డారని.. చంపేస్తామని బెదిరిస్తున్నారని.. అబద్దాలు చెప్పి తల్లిదండ్రులను, పోలీసులను చుక్కలు చూపించింది.  ఇలా ట్విస్టులపై ట్విస్టులు ఇస్తూ.. చివరకు ప్రేమించినోడిని పెళ్లి చేసుకొని.. అందరినీ షాక్‌ కు గురిచేసింది ఆ యువతి.

వివరాల్లోకెళితే..కడప జిల్లాకు చెందిన లక్ష్మీ ప్రసన్న అనే యువతి ఓ కాలేజీలో చదువుతుంది. కాలేజీ లెక్చర్ సాయి కేశవరెడ్డి,  యువతి ప్రేమించుకుంటున్నారు. అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెప్పారు. వీరి పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించలేదు. దీంతో ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇక యువతి పెద్ద ప్లానే అల్లింది. మొదట ఓ బుర్ఖా కొనుగోలు చేసింది. రెండు రోజుల క్రితం బుర్ఖాను బ్యాగులో పెట్టుకొని ఇంటి నుంచి బయటకు వచ్చింది లక్ష్మీ ప్రసన్న. కడపలోని ఓ ప్రైవేటు విద్యాసంస్థలోకి వెళ్లి ప్రసన్న బుర్ఖా ధరించింది. ఆ తర్వాత సాయి కేశవరెడ్డి వెయిట్ చేస్తున్న ఆళ్లగడ్డకు కడప నుంచి బస్సులో బయల్దేరింది.

ఈ సమయంలో తనను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారని.. చంపేస్తామని బెదిరిస్తున్నారని వాట్సాప్‌ లో తల్లిదండ్రులకు మేసేజ్ పెట్టింది. దీంతో తల్లిదండ్రులు హుటాహుటిన పోలీసు స్టేషన్‌కు వెళ్లి తమ బిడ్డ అదృశ్యమైందని.. ఆమెను అత్యాచారం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రసన్న కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే సాయికేశవ రెడ్డి, ప్రసన్న కలిసి హైదరాబాద్ చేరుకున్నారు. నగరంలోని ఓ ఆర్యసమాజ్ కేంద్రంలో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ వివాహం చేసుకున్న ఫోటోలను వాట్సాప్‌ లో తల్లిదండ్రులకు పంపింది ప్రసన్న. తనను కిడ్నాప్ ఎవరూ చేయలేదని మేసేజ్ పెట్టింది. ఇద్దరం మేజర్లం కాబట్టి.. తమ ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నామని వీడియో మేసేజ్‌ లో పోలీసులకు తెలుపడంతో కాడ్నాప్ కథ సుఖాంతమైంది. అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకోవడం తల్లిదండ్రులకు ఇష్టం లేదు. ప్రసన్న కుటుంబ సభ్యులు.. వీరి ప్రేమ వివాహంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

 

Posted in Uncategorized

Latest Updates