డిపాజిటర్ల రూ.58లక్షలు నొక్కేశాడు.. బ్యాంక్ మేనేజర్ అరెస్ట్

సికింద్రాబాద్ : అతడో బ్యాంక్ మేనేజర్. కానీ తిన్నింటి వాసాలు లెక్కపెట్టాడు. పనిచేస్తున్న బ్యాంక్ కే కన్నం వేశాడు. నాలుగేళ్లుగా అదే బ్యాంక్ లో పనిచేస్తూ.. కొంచెం కొంచెం.. కొద్దికొద్దిగా డబ్బులను తన అకౌంట్లు, బంధువుల అకౌంట్లకు ట్రాన్స్ ఫర్ చేసుకున్నాడు. ఇన్నేళ్లలో డిపాజిటర్లకు సంబంధించిన దాదాపు అరవై లక్షలు నొక్కేశాడు. పాపం పండడంతో.. పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసి… మనీ మొత్తం దాదాపుగా రికవరీ చేశారు.

సికింద్రాబాద్ ఏపీ మహాజన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లో మేనేజర్ పరోల్ సుబ్రమణ్యం మురళి బాగోతమే ఇదంతా. సీనియర్ మేనేజర్ స్థాయిలో ఉంటూనే… చీటింగ్ కు పాల్పడ్డాడు సుబ్రమణ్యం మురళి. 2014 నుంచి ఇదే బ్యాంక్ లో ఉద్యోగిగా ఉంటున్న మురళి… బ్యాంక్ ఉన్నతాధికారులకు తెలియకుండా మోసానికి పాల్పడ్డాడు. రూ.58 లక్షల 49 వేల 566 నగదును తనకు సంబంధించిన అకౌంట్లకు ట్రాన్స్ ఫర్ చేసుకున్నాడు. కొంత నగదును సొంత అవసరాలకు వాడుకున్నాడు.

అతడి తీరుపై అనుమానంతో బ్యాంక్ నుంచి కంప్లయింట్స్ రావడంతో… నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దర్యాప్తు చేశారు. చీటింగ్ కు పాల్పడిన బ్యాంక్ మేనేజర్ మురళిని అరెస్ట్ చేశారు. అతని నుంచి రూ. 56 లక్షల 30 వేలు స్వాధీనం చేసుకున్నారు. సెక్షన్ 409, 420, 477a కింద కేసులు పెట్టారు.

కష్టపడకుండా డబ్బులు సంపాదించడానికి ఈ ప్లాన్ వేశాడని సీపీ అంజన్ కుమార్ చెప్పారు. వాటిలో రూ. 35లక్షల నిధులను తన కుటుంబ సభ్యులకు పంపాడని చెప్పారు. 2016 నుంచి 2018 వరకు మొత్తం నిధులను విడతల వారీగా బ్యాంక్ నుంచి బయటకు వెళ్లాయని చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates