డీపీఆర్ రూపొందించండి :  గ్రామాల్లో కోల్పోయిన పచ్చదనం తిరిగి రావాలన్న సీఎం

హరితహారం  కార్యక్రమానికి  నరేగా  నిధులను  వినియోగించుకోవాలని  అధికారులను  ఆదేశించారు  ముఖ్యమంత్రి  కేసీఆర్. నర్సరీల్లో  మొక్కలను  సిద్ధం చేయటం  నుంచి.. వాటిని  కాపాడే  వరకు… ప్రతీ దశలోనూ  మానవ  శ్రమే  ప్రధానమన్నారు.  అందుకు  వ్యవసాయ  కూలీలతో  పనులు చేయించేలా  కార్యాచరణ  రూపొందించాలని  చెప్పారు.  అందుకోసం  డీపీఆర్  రూపొందించాలని  ఆదేశించారు  సీఎం.

గ్రామాల్లో కోల్పోయిన పచ్చదనం, పర్యావరణం తిరిగి రావాలన్నారు సీఎం కేసీఆర్. ఇంతకాలం జరిగిన నష్టాన్ని పూడ్చాల్సిన అవసరముందని చెప్పారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంతో అడవుల పునరుద్ధరణ జరగాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించాల్సిన హరితహారం కార్యక్రమంపై.. ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి కేసీఆర్. మంత్రులు కేటీఆర్, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, ఇతర అధికారులు పాల్గొన్నారు. కొత్తగా ఏర్పాటు చేసుకున్న వాటితో కలిపి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 12వేల 751 గ్రామ పంచాయతీలు ఉన్నయన్న సీఎం.. ఒక్కో గ్రామాన్ని ఒక్కో యూనిట్ గా తీసుకోవాలని సూచించారు. ప్రతీ గ్రామంలో నర్సరీలు పెంచాలని ఆదేశించారు.

నర్సరీల్లో మొక్కలు సిద్ధం చేయటం, వాటిని పంపిణీ చేయటం, గుంతలు తీయటం, నీళ్లు పోయటం లాంటి పనులన్నీ మానవ శ్రమతో కూడుకున్నవేనన్నారు సీఎం. వ్యవసాయ కూలీలను ఈ పనులకు ఉపయోగించే అవకాశం ఉందని చెప్పారు. నరేగా నిబంధనలు కూడా ఉపాధి కల్పించే పనులు చేపట్టాలని ఖచ్చితంగా చెప్పాయని గుర్తుచేశారు. నరేగా నిధులను తెలంగాణ హరితహారం కార్యక్రమానికి వినియోగించటం సముచితంగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో చేపడుతున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమం కోసం నరేగా నిధులు వాడుకోవడానికి కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పనులకు సంబంధించిన డీపీఆర్ సిద్ధం చేయాలని.. ఎంత ఖర్చవుతుందో అంచనా వేయాలని సూచించారు.

గ్రామాల్లో పండ్ల చెట్ల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. నర్సరీల్లో పెంచే మొక్కల్లో 25 శాతం పండ్ల మొక్కలుండాలన్నారు. అడవి జీవులు తినే తునికి, ఎలక్కాయ, మొర్రి, నేరేడు, సీతాఫల, జామ వంటి పండ్ల మొక్కలను పెద్ద సంఖ్యలో సిద్ధం చేసి, పంపిణీ చేయాలని సూచించారు. అడవులు, పొలాలు, ఖాళీ ప్రదేశాలలో పండ్ల మొక్కలు పెంచాలని చెప్పారు సీఎం.

 

Posted in Uncategorized

Latest Updates