డీలర్లకే వాహనాల రిజిస్ట్రేషన్ బాధ్యత

licence
కొత్తగా వాహనాలను కొనుగోలు చేసిన వారికి..రిజిస్ట్రేషన్ కోసం కష్టపడాల్సిందే. ఆర్టీఏ ఆఫీసు చుట్టూ కొద్ది రోజులు తిరగక తప్పదు. అయితే వాహనదారులు ఇకపై అలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా…చర్యలు చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వాహనాల రిజిస్ట్రేషన్‌ బాధ్యతను షోరూం డీలర్లకే అప్పగించనున్నారు. వాహనాలను అమ్మే డీలర్లే వాటికి రిజిస్ట్రేషన్‌ చేసి నంబర్లను కేటాయించనున్నారు. ఈ విధానానికి సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నలిచ్చారు. రాష్ట్రానికి అనువుగా ఉండే విధానాన్ని ఎంపిక చేయాలంటూ రవాణా శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా అధికారులు కొత్త విధాన ప్రణాళికను రూపొందించనున్నారు. ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉన్న విధానాలను పరిశీలించి నివేదిక అందజేయనున్నారు. ప్రస్తుతం రవాణా శాఖ కార్యాలయాల్లోనే వాహనాలను రిజిస్టర్‌ చేసి.. నంబర్లను కేటాయిస్తున్నారు. డీలర్లు ‘టెంపరరీ రిజిస్ట్రేషన్లు’ మాత్రమే చేస్తున్నారు.

తర్వాత వాహనదారులు.. రవాణా శాఖ కార్యాలయాల నుంచి నెల రోజుల్లో పర్మనెంట్‌ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. వాహనదారు ఇంటి చిరునామా ప్రకారం… వారు ఏ రోడ్డు ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ(ఆర్‌టీఏ) కార్యాలయం పరిధిలోకి వస్తారో… అక్కడి నుంచి రిజిస్ట్రేషన్‌ నంబర్‌ను పొందాల్సి ఉంటుంది. వాహనాన్ని ఆర్టీఏ కార్యాలయం దగ్గరకు తీసుకెళ్లి, దాంతో పాటు ఫొటో దిగి ఆర్టీఏ ఆమోదం పొందాలి. వాహన ఇన్వాయిస్‌, చాసిస్‌ నంబర్‌, బాడీ బిల్డింగ్‌, పన్ను చెల్లింపు వివరాలన్నింటినీ పరిశీలించిన తర్వాత ఆర్టీవో ఆమోద ముద్ర వేస్తారు. తర్వాత ఆ కార్యాలయంలో అందుబాటులో ఉండే సిరీస్‌ ప్రకారం పర్మనెంట్‌ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ను వాహనానికి కేటాయిస్తారు. ఈ విధానానికి ఇక మీదట స్వస్తి చెప్పనున్నారు. వాహనాలకు డీలర్లే రిజిస్ట్రేషన్‌ చేసి, నంబర్లు కేటాయించే విధానం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌, ఢిల్లీలో అమల్లో ఉంది. తెలంగాణలో టూ వీలర్స్‌, ఫోర్‌ వీలర్స్‌ తదితర వాహనాల డీలర్లు 1000మంది దాకా ఉన్నారు. వీరే కొత్త వాహనాలను రిజిస్ట్రేషన్‌ చేయనున్నారు.

ప్రస్తుతం కొత్త వాహనాలకు హైసెక్యూరిటీ నంబర్‌ ప్లేట్లను ఆర్టీఏ కార్యాలయాల్లోనే బిగిస్తున్నారు. ఇందుకుగాను టూవీలర్స్‌ నంబర్‌ ప్లేట్‌కు రూ.249, కార్లు, ఇతర భారీ వాహనాల నంబర్‌ ప్లేట్లకు రూ.625 చొప్పున వసూలు చేస్తున్నారు. ఔట్‌ సోర్సింగ్‌పై తాను నియమించుకున్న ప్రైవేటు ఏజెన్సీలతో హైసెక్యూరిటీ నంబర్‌ ప్లేట్లను బిగింపజేస్తోంది. ఇకపై కొత్త వాహనాలకు షోరూముల్లోనే నంబర్‌ ప్లేట్లను బిగించనున్నారు.

Posted in Uncategorized

Latest Updates