డేట్ కూడా చెప్పాడు : మోడీని చంపేస్తానంటూ మెయిల్

ఢిల్లీ : ప్రధాని మోడీకి బెదిరింపు మెయిల్ వచ్చింది. మోడీని హత్య చేస్తామంటూ.. ఢిల్లీ పోలీస్‌ కమీషనర్‌ అమూల్య పట్నాయక్‌ కు ఇవాళ (అక్టోబర్-13)న ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఈ-మెయిల్‌ వచ్చింది. దీంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఒక్క లైను మెసేజ్ మాత్రమే ఉన్న ఆ మెయిల్‌ లో 2019లోని ఓ డేట్ ని , ఆ రోజున ప్రధాని మోడీపై దాడి జరుపుతామని చెప్పాడు దుండగుడు.

అయితే, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు బయటికిరానివ్వకుండా జాగ్రత్తపడినట్లు తెలుస్తోంది. ఓ జాతీయ మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీ పోలీస్‌ కమీషనర్‌ కు ఆ మెయిల్‌ అసోంలోని ఓ జైలు నుంచి వచ్చిందని తెలిసింది. ఈ విషయంపై నిఘా వర్గాలు అప్రమత్తమై దర్యాప్తు ప్రారంభించాయి. ప్రధాని మోడీ త్వరలో పలు రాష్ట్రాల్లో బహిరంగ సభల్లో పాల్గొనే అవకాశం ఉండడంతో .. పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. మోడీని హత్య చేసేందుకు పన్నిన కుట్రకు సంబంధించి మహారాష్ట్రలోని పుణె పోలీసులకు ఇటీవల ఓ లెటర్ దొరికింది. జూన్‌ లో పోలీసులు ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌ గాంధీ హత్య తరహాలోనే మోడీపై దాడి చేయాలని మావోయిస్టులు కుట్ర పన్నినట్లు అప్పట్లో పోలీసులకు తెలిసింది. భీమా కొరెగాన్‌ కేసులో ఒకరి ఇంట్లో సోదాలు నిర్వహించిన క్రమంలో ఈ లెటర్ దొరికింది.  ఇప్పుడు మళ్లీ మోడీపై దాడి చేస్తామంటూ దుండగుడు మెయిల్‌ పంపడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు. మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది..ఎవరు చేశారు అని తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Posted in Uncategorized

Latest Updates