డేట్ మార్చేద్దాం : బాలల దినోత్సవం ఆ రోజు వద్దు

బీజేపీ ఎంపీలు ఓ అనూహ్య డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 100 మంది బీజేపీ ఎంపీలు ప్రధాని మోడీకి లేఖ ద్వారా కోరారు. అదేంటంటే.. బాలల దినోత్సవం తేదీని మార్చాలని. అవును.. ఇప్పటి వరకు చిల్డ్రన్స్ డే అంటే నవంబర్ 14వ తేదీన జరుపుకుంటున్నాం. ఇక నుంచి డిసెంబర్ 26వ తేదీన జరపాలని కోరారు. దీనికి కారణం కూడా లేఖలో ప్రస్తావించారు. నవంబర్ 14వ తేదీన బాలల దినోత్సవం పేరుతో జవహర్ లాల్ నెహ్రూని ఎక్కువగా కీర్తిస్తున్నారని.. పిల్లల ప్రతిభని ప్రసంశించకుండా.. నెహ్రూకి భజన చేస్తున్నారని చెప్పుకొచ్చారు. తేదీ మార్పు వల్ల ఇలాంటి భావన పోయి.. పిల్లలపై మరింత శ్రద్ధ, వారి ప్రతిభపై ఫోకస్ చేయటానికి వీలు ఉంటుందని బీజేపీ ఎంపీలు అభిప్రాయపడ్డారు. ఈ మేరకే ప్రధాని మోడీకి లేఖ రాశారు. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం కానీ.. అభిప్రాయం కూడా చెప్పలేదు పీఎంవో కార్యాలయం.

నెహ్రూ జయంతి అయిన నవంబర్ 14వ తేదీన అంకుల్ డే లేదా చాచా దివస్ గా జరపాలని కూడా సూచించారు ఈ ఎంపీలు. గురుగోవింద్ సింగ్ కుమారుల బలిదానాలకు స్ఫూర్తిగా డిసెంబర్ 26వ తేదీని బాలల దినోత్సవంగా జరపాలని డిమాండ్ చేస్తూ 100 బీజేపీ ఎంపీల సంతకాలతో ప్రధాని మోడీకి లేఖ రాశారు వెస్ట్ ఢిల్లీ లోక్ సభ ఎంపీ పర్వేష్ సాహిబ్ సింగ్.

Posted in Uncategorized

Latest Updates