డ్రగ్స్ తో జీవితం నాశనం.. 20 ఏళ్లుగా మ్యాన్ హోల్ లోనే నివాసం

కొలంబియాలోని  మెడెలిన్‌ నగరం అండర్‌ వరల్డ్‌‌‌‌ డ్రగ్స్‌‌‌‌ మాఫియాకు కేరాఫ్‌ అడ్రస్‌‌‌‌. డ్రగ్స్‌‌‌‌ కోసం నేరాలకు పాల్పడే వాళ్లు ఎందరో. ఆ వ్యసనంతో మరికొందరు తమ జీవితాలను చిద్రం చేసుకున్నారు. మారియా గార్షియా- మిగ్వెల్ రెస్ట్రెపో జంట కూడా డ్రగ్స్‌‌‌‌ బాధితులే. యవ్వనం నుంచి డ్రగ్స్‌‌‌‌ మత్తుకి బానిసలై ఉన్నదంతా పొగొట్టుకుని రోడ్డున పడ్డారు.

రిహాబిలిటేషన్ సెంటర్‌లో చేరేందుకు వాళ్ల దగ్గర పైసా కూడా లేదు. అదే సమయంలో మారియా ఆరోగ్యం మరీ క్షీణించింది. దీంతో రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై కొన్నాళ్లు కాలం వెళ్లదీసింది ఆ జంట. ప్రారంభంలో మిగ్వెల్‌‌‌‌కు పని ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. తర్వాత ముర్కేలోని ఓ బేకరీలో క్లీనింగ్ డిపార్ట్ మెంట్ లో చేరాడు ఆ పెద్దాయన.

మ్యాన్‌ హోల్‌ ఇల్లు

రాను రాను ఫుట్‌పాత్‌పై జీవించడం ఆ జంటకు కష్టంగా మారింది. ఆ సమయంలో ఓ పాడుపడ్డ  డ్రైనేజీ మ్యాన్‌ హోల్‌ను మిగ్వెల్‌ గుర్తించాడు. తన దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బుతో ఆ మ్యాన్‌హోల్‌ను ఇంటిగా మలుచుకుని, కరెంట్‌ సౌకర్యం ఏర్పాటు చేశాడు. మెల్లిగా డ్రగ్స్‌‌‌‌ వ్యసనం నుంచి ఆ దంపతులు బయటపడ్డారు. ఆ మ్యాన్‌ హోల్‌లోనే చిన్న వంటగది, టీవీ, మంచం ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నారు. అలా 20 ఏళ్లుగా ఆ ఇంట్లోనే జీవించారు. తర్వాత చిన్నచిన్న పనులకు సాయం కోసం, ఇంటికి కాపలాగా బ్లాకీ అనే కుక్కను పెంచుకున్నారు. ఈ జంట గురించి 2012లో తొలిసారిగా కొన్ని మీడియా చానెళ్లు ప్రముఖంగా వార్తలు ప్రచురించాయి. వాళ్ల గురించి తెలుసుకున్నకొందరు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చారు. కానీ, ఆ సాయాన్ని వద్దని చెప్పేశారు. పైగా డ్రగ్స్‌‌‌‌ రిహాబిలిటేషన్‌ సెంటర్లకు విరాళాలు ఇస్తూ తమ ఔన్నత్యాన్ని చాటుకుంది ఆ వృద్ధ జంట.

అయితే గత నెల రోజులుగా ఆ జంట కనిపించకపోవడం ఆ ప్రాంతంలో కలకలం రేపుతోంది. డ్రగ్స్‌‌‌‌కు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తున్న ఒక ఎన్జీవోలో మిగ్వెల్ సభ్యుడు. ఖాళీ సమయంలో డ్రగ్స్‌‌‌‌ బాధితులకు కౌన్సెలింగ్‌ ఇస్తున్నాడు ఆయన. అంతేకాదు డ్రగ్స్‌‌‌‌ మాఫియాకు వ్యతిరేకంగా పోలీసులకు సమాచారం ఇస్తుంటాడు. ఈ వ్యవహారంలో మిగ్వెల్ కి బెదిరింపులు కూడా వచ్చాయంట. దీంతో ఆ జంటకు డ్రగ్స్‌‌‌‌ మాఫియా ఏదైనా ప్రమాదం తలపెట్టి ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు. అయితే  ఆ ఎన్జీవో సెక్రెటరీ ట్రాంగ్‌చింగ్‌ మాత్రం మరో వాదన వినిపిస్తున్నాడు. మ్యాన్‌ హోల్‌ చుట్టుపక్కల మరమ్మత్తులతో కార్పొరేషన్‌ విభాగం ఆ జంటకు నోటీసులు జారీ చేసిందట. అధికారులే బలవంతంగా వాళ్లను అక్కడి నుంచి ఖాళీ చేయించి ఉంటారని ఆయన అంటున్నాడు. ప్రస్తుతం ఆ జంట ఆచూకీ కోసం సోషల్‌ మీడియాలో పలువురు ఆరా తీస్తున్నారు. ట్రాంగ్‌ ఇచ్చిన ఫిర్యాదుతో మిస్సింగ్‌ కంప్లైంట్ నమోదు చేసుకున్న ముర్కే పోలీసులు విచారణ చేపట్టారు.

Posted in Uncategorized

Latest Updates