తగిన మూల్యం చెల్లించక తప్పదు : పాక్ కు నిర్మల హెచ్చరిక

Nirmalaజమ్ముకశ్మీర్‌లోని సుంజ్వాన్ ఆర్మీక్యాంప్‌పై ఉగ్రవాదుల దాడి ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది భారత్. ఈ దుస్సాహసానికి పాకిస్థాన్ తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్. ఉగ్రవాదులు సరిహద్దులు దాటివచ్చినట్లు తమ వద్ద ఆధారాలున్నాయని, పాకిస్థానే అందుకు బాధ్యత వహించాలని స్పష్టంచేశారు రక్షణ మంత్రి. అయితే తమ సరిహద్దులు దాటి లక్షితదాడులు జరిపేందుకు భారత్ సాహసించవద్దని హెచ్చరించింది పాక్ ప్రభుత్వం.

మరోవైపు యుద్ధం పరిష్కారం కాదని, రక్తపాతాన్ని నివారించేందుకు భారత్-పాక్ చర్చలు జరుపాలని జమ్ముకశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ సూచించారు. ఉగ్రవాదులు దాడిచేసిన సుంజ్వాన్ ఆర్మీ క్యాంప్ ప్రాంతంలో రక్షణమంత్రి నిర్మలాసీతారామన్ హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన నిర్మల… పాక్ వైఖరిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. పాక్‌లో నివసిస్తున్న మసూద్ అజహర్ ప్రోద్బలంతో జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారని ఆరోపించారామె. సరిహద్దుకు ఆవల నుంచే వారికి ఆదేశాలిచ్చి నడిపించారు. ఆర్మీక్యాంప్, కుటుంబాలు రెండూ ఉండే ప్రాంతాన్ని ఎంపిక చేయాలని మసూద్ అజార్ నుంచి ఆదేశాలు వచ్చాయి. అందుకే సుంజ్వాన్ క్యాంప్‌ను వారు లక్ష్యంగా చేసుకున్నారు.

స్థానికుల మద్దతు కూడా ఉగ్రవాదులకు లభించి ఉండొచ్చు అని తెలిపారు నిర్మలా సీతారామన్. చొరబాట్లను ప్రోత్సహించేందుకే పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నదని విమర్శించారు. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ప్రభుత్వం సమర్థవంతంగా తిప్పికొడుతుందని, ఆ దిశగా ఓ కార్యచరణకు సిద్ధమవుతున్నదని వెల్లడించారు ఆమె. ఇప్పటికే ఎన్నోసార్లు ఉగ్రవాదుల చర్యల వెనుక పాక్ హస్తమున్నట్లు నిరూపితమైంది. సుంజ్వాన్ దాడికి సంబంధించి కూడా పక్కా ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ దుస్సాహసానికి సిద్ధమైన పాక్ తగిన మూల్యం చెల్లించేలా చేస్తామని హెచ్చరిక చేశారు సీతారామన్. అనంతరం మిలిటరీ దవాఖానకు వెళ్లిన నిర్మల ఉగ్రదాడిలో గాయపడిన వారిని పరామర్శించారు.

Posted in Uncategorized

Latest Updates