తప్పుడు వార్తలు ప్రచారం చేయం : ఈసీకి ఫేస్‌బుక్‌, ట్విటర్‌, గూగుల్‌ హామీ 

ఎన్నికల సమయంలో తమ సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు వార్తలు ప్రచారం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటీమని ఫేస్‌బుక్‌, ట్విటర్‌, గూగుల్‌లు తమకు హామీ ఇచ్చినట్లు వెల్లడించారు ఎన్నికల ప్రధానాధికారి ఓపీ రావత్‌. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, మిజోరాం, ఛత్తీస్‌గఢ్‌లలో శాసనసభ ఎన్నికలు జరగాల్సి ఉన్న విషయం గమనార్హం. ఈ నేపథ్యంలోనే సీనియర్‌ డిప్యూటీ ఎన్నికల కమిషనరు ఉమేష్‌ సిన్హా సారథ్యంలోని సంఘం గూగుల్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్ల ప్రాంతీయ అధికారులతో సమావేశమయ్యారు. ప్రజలను ప్రభావితం చేసేలా తప్పుడు వార్తలు సదరు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారంకాకుండా చూసేందుకు ఎలాంటి చర్యలు చేపడతారంటూ వారిని ప్రశ్నించారు. ఇబ్బందులేవీ రాకుండా తాము కట్టుదిట్టమైన చర్యలు చేపడతామంటూ సామాజిక మాధ్యమాల ప్రతినిధులు ఉమేష్‌ సిన్హా సారథ్యంలోని కమిటీకి హామీ ఇచ్చినట్లు చెప్పారు రావత్‌. పోలింగ్‌ కు 48 గంటల ముందు నుంచీ తమ సామాజికమాధ్యమాలపై ఎన్నికల సంబంధ సమాచారాన్ని  ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమన్నారు. ఎన్నికల సమయంలో తమ సామాజిక  వేదికలపై అయిన వ్యయం వివరాలు సైతం ఎన్నికల సంఘంతో నేరుగా పంచుకునేందుకు వీలుకల్పించే ఓ వ్యవస్థను కూడా గూగుల్‌ ఏర్పాటు చేయనుందని తెలిపారు రావత్.

Posted in Uncategorized

Latest Updates