తయారీలో వేగం పెరిగింది : 90 లక్షల బతుకమ్మ చీరెలు

తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేసే బతుకమ్మ చీరెల తయారీలో వేగం పుంజుకుంది. బతుకమ్మ పండుగను పురస్కరించుకొని ఆడబిడ్డలకు పంపిణీ చేసే చీరలను నిర్ణీత సమయంలో తయారు చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే మూడోవంతు చీరెల తయారీ పూర్తయింది. చీరెల తయారీ నెమ్మదించడాన్ని గుర్తించిన పరిశ్రమలు, చేనేత, జౌళిశాఖ మంత్రి కే తారకరామారావు ఆసాములు, మాస్టర్ వీవర్స్‌తో భేటీ అయ్యారు. పనులను వేగవంతం చేయాలని, చీరెలను తయారుచేసే మగ్గాల సంఖ్యను పెంచాలని ఆదేశించారు. రాష్ట్రస్థాయి అధికారులు రోజువారీగా పర్యవేక్షించాలని స్పష్టంచేశారు. మంత్రి ఆదేశాలతో పనుల్లో వేగం పెరిగింది. చీరెల తయారీ కోసం ఈ నెల ప్రారంభంలో 10 వేల మరమగ్గాలను ఉపయోగించగా, ఆ సంఖ్యను 15 వేలకు పెంచారు. మరో వారంలో మగ్గాల సంఖ్యను 20 వేలకు పెంచాలని నిర్ణయించారు అధికారులు.

బతుకమ్మ చీరెలను తెల్లకార్డుపై పేరుండి 18 ఏండ్లు పైబడిన మహిళలందరికీ అందజేయనున్నారు. ఈ సంవత్సరం 90 లక్షల మందివరకు అర్హులు ఉంటారని అధికారులు అంచనా వేశారు. వీటిని సిరిసిల్లలోని మరమగ్గాలపై తయారు చేయిస్తుండగా, ఇప్పటికే 30 లక్షలకు పైగా చీరెల తయారీ పూర్తయింది. అక్టోబర్ మొదటివారంలో బతుకమ్మ పండుగ మొదలు కానున్నందున, సెప్టెంబర్ నెలాఖరుకల్లా అన్ని జిల్లాకేంద్రాలకు పంపించాలని నిర్ణయించారు.

Posted in Uncategorized

Latest Updates