తల్లి కళ్లెదుటే ఘోరం : స్కూల్ ఫస్ట్ డే.. ఆ చిన్నారి చివరి రోజు

childఅప్పటి వరకు అల్లారు ముద్దుగా.. ఇళ్లంతా సందడి చేసిన చిన్నారి.. మొదటి సారిగా స్కూల్ కి వెళ్లాడు. కొత్త బ్యాగ్, కొత్త లంచ్ బాక్స్, కొత్త పుస్తకాలు, కొత్త యూనిఫాం.. అంతా కొత్త కొత్తగా ఉంది ఆ చిన్నారికి. మొదటి రోజు స్కూల్ కు వెళుతున్నాడు.. జీవితంలో ఎంతో ఉన్నత స్థాయి వెళ్లాలి అనే కలలు కన్నారు ఆ తల్లిదండ్రులు. ఎంతో చక్కగా రెడీ చేసింది బుజ్జాయిని. తనకు తానే మురిసిపోయింది ఆ తల్లి. స్వయంగా కొడుకును తీసుకుని స్కూల్ కు వచ్చింది. తల్లి చేయిపట్టుకునే బడిలోకి అడుగు పెట్టబోతున్నాడు ఆ చిన్నారి. అంతే..  వేగంగా దూసుకొచ్చిన ఓ కారు ఆ చిన్నారిని బడికి కాదు.. మరభూమికి పంపింది. ఈ దారుణ ఘటన బుధవారం(జూన్-20) హైదరాబాద్ సైదాబాద్ లో జరిగింది.

హాఫిజ్‌బాబానగర్‌ ప్రాంతానికి చెందిన షేక్‌ మహబూబ్‌ అలీ, ముబీన్‌ బేగం దంపతుల కుమారుడు రహ్మాన్‌అలీ. మూడున్నరేళ్ల కుమారుడు రహ్మాన్‌అలీని సైదాబాద్‌-ధోబీఘాట్‌ ప్రధాన రహదారిపై ఉన్న ఓ స్కూల్లో ఇటీవలే నర్సరీలో చేర్పించారు. రంజాన్‌ తర్వాత బడికి పంపుదామని ఇంతవరకు పంపలేదు. మొదటి రోజు కావడంతో బుధవారం తల్లి ముబీన్‌ బేగం కొడుకును తీసుకుని ఆటోలో బడి దగ్గరకు చేరుకుంది. ఆటో దిగి ఇద్దరు పాఠశాలలోకి వెళ్తుండగా దగ్గరలోని మాతృశ్రీ కాలనీ నుంచి ఓ కారు వేగంగా దూసుకొచ్చింది. చూస్తుండగానే రహ్మాన్‌ను ఢీకొట్టింది. చిన్నారి కారు ముందు చక్రాల కింద పడ్డాడు. కారు బాలుడిపై నుంచి దూసుకువెళ్లింది. తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న చిన్నారిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. పోలీసులు సంఘటన స్థలం దగ్గర నుంచి కారును స్వాధీనం చేసుకున్నారు.

అప్పటి వరకు తన చేయి పట్టుకుని ఉన్న కొడుకు.. కళ్ల ముందే చనిపోవడంతో ఆ తల్లి తో పాటు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates