తిరుమలకు వీఐపీలు ఏడాదికి ఒకసారే రావాలి.. వెంకయ్య నాయుడు

తిరుమల : తిరుమలలో ఈ ఉదయం వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. దర్శనం ముగించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడారు వెంకయ్య. ఒకసాధారణ పౌరుడిగానే స్వామిని దర్శించుకున్నా అన్నారు. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకూ.. వెంకన్న భక్తులు పెరుగుతున్నారని చెప్పిన వెంకయ్య.. వారందరికి దర్శనం అవకాశం సులభంగా కలగాలన్నారు.

నాయకులు పదే పదే రావడం తగ్గించాలని కోరారు వెంకయ్యనాయుడు. స్వామి దర్శనానికి వీఐపీలు సంవత్సరానికి ఒకసారి వస్తే మిగతా భక్తులందరికీ కూడా దర్శన భాగ్యం సులభంగా జరుగుతుందని అభిప్రాయపడ్డారు ఉపరాష్ట్రపతి. ఇదే అంశాన్ని పరిశీలించాలని టీటీడీ అధికారులకు చెప్పానన్నారు వెంకయ్యనాయుడు. మరొకరు ఇబ్బంది పడుతూ మనం సంతోషంగా ఉంటే అది మంచిది కాదన్నారు.

ఉపరాష్ట్రపతిగా మహాద్వారం నుంచి దర్శనానికి వెళ్ళాల్సి ఉన్నా, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి స్వామి దర్శనానికి వెళ్లడం తనకు ఆనందాన్ని ఇస్తోందన్నారు ఉపరాష్ట్రపతి. క్యూలైన్ లోనే వెళ్లి దర్శనం చేసుకున్నా అన్నారు. వేంకటేశుడి ముందు అందరూ సమానులే, సామాన్యులే అన్నారు.

Latest Updates