తిరుమల తరహాలోనే తిరుచానూరులో కూడా

తిరుమల తరహాలో తిరుచానూరులో కూడా వీఐపీ బ్రేక్ దర్శనాలకు అంతా రెడీ అయ్యింది. రేపటి నుంచి అమ్మవారి ఆలయంలో అమలు చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. మరోవైపు కుంకుమార్చన రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన టీటీడీ… భక్తుల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గింది. ఆలయ సమయాల్లో  కూడా మర్పులు చేశారు అధికారులు.

తిరుమల వీఐపీ కల్చర్ తిరుచానూరుకు కూడా పాకింది. తిరుమల శ్రీవారి ఆలయం తరహాలో..తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి గుడిలో కూడా రేపటి నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలు మొదలుకానున్నాయి. రోజు రోజుకు పద్మావతి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య పెరగటంతో టీటీడీ కొత్తగా ఈ బ్రేక్ దర్శనాలను ప్రవేశ పెట్టినట్లు అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా అమ్మవారి దర్శనార్థం వచ్చే ప్రోటోకాల్ వీఐపీ లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉదయం పదకొండున్నర నుంచి 12 గంటల వరకు…రాత్రి 7 నుంచి ఏడున్నర గంటల వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు అమలు చేయాలని నిర్ణయించారు. ఉదయం వీఐపీ దర్శనాలు కావలిసిన వారు ఉదయం 8 గంటల లోపు…రాత్రి బ్రేక్ దర్శనం కోసం మధ్యాహ్నం 3 గంటల లోపు డిప్యూటీ ఈఓ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాల్సి ఉంటుంది. వీఐపీ బ్రేక్ టిక్కెట్లు కలిగిన వారు అరగంట ముందుగానే ఆలయానికి చేరుకోవాలని చెప్తున్నారు అధికారులు.

అమ్మవారి ఆలయంలోని ఆర్జిత సేవలన్నిటిని ఆన్ లైన్ చేయనున్నారు అధికారులు. సగం కోటాను ఆన్ లైన్లో, సగం కోటాను కరెంట్ బుకింగ్ కింద భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు TTD డిప్యూటీ E O మునిరత్నం రెడ్డి తెలిపారు. అలాగే అమ్మవారి కల్యాణోత్సవాన్ని ఉదయం 10  నుంచి 11  గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు, వీఐపీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకుని ఆలయం తెరిచే, మూసివేసే సమయాన్ని అదనంగా గంట పొడిగించారు. ఆగష్టు 1 నుంచి దర్శన వేళల్లో మార్పుల్ని అమలు చేస్తున్నారు. గతంలో అయిదు గంటలకు సుప్రభాత సేవ నిర్వహిస్తుండగా…ప్రస్తుతం నాలుగున్నరకే సుప్రభాతం నిర్వహించనున్నారు. ఉదయం కల్యాణోత్సవం సమయాన్ని పదిన్నర నుంచి 10 గంటలకు జరిపారు.

అమ్మవారి సన్నిధిలో నిత్యం నిర్వహించే కుంకుమార్చనను రద్దు చేయాలని ముందుగా నిర్ణయించారు.. అయితే భక్తుల నుంచి వ్యతిరేకత రావడంతో అమ్మవారి కుంకుమార్చన సేవ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం నాలుగున్నార వరకు వరకు యధావిధిగా కొనసాగించాలని నిర్ణయించారు.అమ్మవారి ఆలయంలో వి.ఐ.పి బ్రేక్ దర్శనాలు అమలు చేయడంపై భక్తులు నుంచి వ్యతిరేకత మొదలైంది. టీటీడీ అధికారులు తీరు మార్చుకోవాలని కోరుతున్నారు. అమ్మవారి ముందు అందరం సమానమేనంటున్న అధికారులు…. వీఐపీ బ్రేక్ దర్శనాల పేరుతో సామాన్య భక్తులను ఇబ్బంది పెడుతున్నారని మండిపడుతున్నారు.

 

Latest Updates