తిరుమ‌ల‌ శ్రీవారి ఆస్తుల విక్ర‌యం నిలిపేస్తూ ప్ర‌భుత్వం జీవో

తిరుమ‌ల శ్రీవారి ఆస్తుల విక్ర‌యానికి సంబంధించి గ‌తంలో టీటీడీ పాల‌క‌మండ‌లి చేసిన తీర్మానాన్ని నిలిపేస్తూ ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఎటువంటి ఆస్తుల‌ను విక్ర‌యించొద్దంటూ సోమ‌వారం జీవో జారీ చేసింది.

టీటీడికి సంబంధించిన 50 ఆస్తుల‌ను విక్ర‌యించాల‌ని 2016 జ‌న‌వ‌రి 30న నాటి పాల‌క‌మండ‌లి తీర్మానం చేసింద‌ని, దానిపై ప్ర‌స్తుత బోర్డు ముందుకు వెళ్లొద్ద‌ని ఆదేశించింది ప్ర‌భుత్వం. భ‌క్తుల మ‌నోభావాల‌ను దృష్టిలో పెట్టుకుని ఆ తీర్మానంపై స‌మీక్ష చేయాల్సిందిగా టీటీడీకి సూచించింది. ఆధ్యాత్మిక వేత్త‌లు, వేద పండితులు, మేధావులు, భ‌క్తులు, ఇత‌ర వ‌ర్గాల‌ను సంప్ర‌దించి.. ఆల‌యాల‌ను నిర్మించ‌డం, ధ‌ర్మ ప్ర‌చారం చేయ‌డం, ఇత‌ర ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌కు ఆయా ఆస్తులు ఉప‌యోగ‌ప‌డుతాయేమో చ‌ర్చించాల్సిందిగా సూచ‌న చేసింది.

అన్ని అంశాల పరిశీల‌న ముగిసి.. ఓ నిర్ణ‌యానికి వ‌చ్చే వ‌ర‌కు శ్రీవారి ఆస్తుల‌ విక్రయాల ప్రక్రియను నిలుపుదల చేయాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా టీటీడీ ఈవోను కోరింది. తిరుమ‌ల శ్రీవారి ఆస్తుల విక్ర‌యానికి సంబంధించి కొద్ది రోజులుగా సాగుతున్న వివాదానికి తాజా జీవోతో రాష్ట్ర ప్ర‌భుత్వం తెర‌దించింది.

Latest Updates