తునికాకు సేకరణకు ప్రభుత్వం టెండర్లు : గిరిజనులకు మంచి ఆదాయం

TUNIKAKUఅడవిలో సహజసిద్దంగా పెరిగే తునికాకు చెట్లు సర్కార్ కు మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. గిరిజనులకు  ప్రతీ ఏటా రెండు నెలలపాటు చేతినిండా పని దొరుకుతోంది. ఆదిలాబాద్ జిల్లాలోని అడవుల్లో ఈసారి మొదటిసారి తునికాకు సేకరణకు ఆన్ లైన్ లో టెండర్లను పిలిచారు అధికారులు. జిల్లాలోని ఇచ్చోడ, ఉట్నూరు డివిజన్లలో 8 రేంజ్ లలో తునికాకు సేకరణ మొదలైంది. మొత్తం 21 యూనిట్లలో 124 కల్లాలు ఏర్పాటు చేయగా… 5వేల 700 స్టాండర్డ్ బ్యాగుల తునికాకు సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నారు అధికారులు.

గత మూడేళ్లగా ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో అటవీప్రాంతంలో తునికాకు అంతగా లేదు. ఉన్న ఆకులపై మచ్చలుండడంతో గుత్తేదార్లు కూడా సేకరణకు ముందుకు రాలేదు. దీంతో కేవలం 18 యూనిట్లు మాత్రమే అమ్ముడవ్వగా… మూడు యూనిట్లలో పని నిలిచిపోయింది.  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో లక్షకు పైగా కూలీలు తునికాకు సేకరణ ద్వారా ఉపాధి పొందుతున్నారు. గతంలో 50 ఆకుల కట్టకు 45 పైసలు ఇవ్వగా..ఈసారి 5 పైసలు పెంచారు. దీంతో సగటున ఒక్కో కూలీ రోజుకు వందకట్టలు సేకరించినా…నెలకు నాలుగు నుంచి ఐదు వేల రూపాయల వరకు ఆదాయం వస్తుంది. శ్రమ ఎక్కువగా ఉండడం, ధర గిట్టుబాటు కాకపోవడంతో ఈ ఏడు ఆకుసేకరణ మరింత తగ్గిపోయే అవకాశాలున్నాయి. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధిహామీ పనులు జరగుతుండడంతో ఆకుసేకరణకు కూలీలు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.  అడవిలో ఎలుగుబంట్ల సంచారం అధికంగా ఉండటం కూడా కూలీలను కొంత కలవరపెడుతోంది.  తునికాకు సేకరణను ప్రభుత్వం ఓ పరిశ్రమలా తీర్చిదిద్దాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఉపాధి హామీతొ దీన్ని అనుసంధానం చేయాలని  కోరుతున్నారు కూలీలు.

 

 

 

 

Posted in Uncategorized

Latest Updates