తుపాకీ పట్టాల్సిన వాడిని…ధైర్యంలేక గవర్నర్ ను అయ్యా: నరసింహన్

ధైర్యలేక గవర్నర్ ను అయ్యాను …లేదంటే తుపాకీ పట్టవాడినన్నారు గవర్నర్ నరసింహన్. అసోంలో ఐఏఎస్‌ అధికారిగా విధులు నిర్వహిస్తున్న తన సోదరుడు బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయాడని తెలిపారు. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేసి, దోషులందర్నీ న్యాయస్థానం ముందు నిలబెట్టిందన్నారు. నిందితులంతా నిర్దోషులుగా విడుదలయ్యారన్నారు. ఆ సమయంలో నాకు ధైర్యం లేకపోవడంతోనే నేను మీ ముందు గవర్నర్‌గా ఉన్నా… లేకుంటే ఆయుధం కలిగిన్న టెర్రరిస్టుగా ప్రభుత్వం నాపై లుకౌట్‌ నోటీసు జారీచేసి ఉండేదన్నారు. న్యాయం దక్కని సందర్భాల్లోనే చాలామంది తుపాకులు పడుతున్నారని తెలిపారు. శనివారం(జూలై-28) హైదరాబాద్ షామీర్ పేటలోని నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయం 16వ స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. న్యాయవ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపారు.

ప్రపంచమంతా ఏకమై ఒక నేరస్థుడిని కాపాడాలని భావించినా న్యాయవ్యవస్థ ప్రభావితం కారాదన్నారు. మన దేశంలో ధనికులకు, పేదలకు న్యాయం సమానంగా అందుతోందా అని ప్రశ్నించారు. కోర్టులో నేరస్థుడు, హంతకుడు అని ప్రకటించిన తర్వాత కూడా ఎందుకు ఉపేక్షిస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు గవర్నర్‌. ధనికుడిపై నేరారోపణ వస్తే గుండె పోటంటూ వెంటనే ఆస్పత్రిలో చేరిపోతాడు. అదే ఆరోపణ పేదోడిపై వస్తే వెంటనే జైలు పాలవుతాడు. తుది తీర్పు అతడికి వ్యతిరేకంగా కూడా రావచ్చన్నారు. కొన్ని సందర్భాల్లో మీడియా ప్రభావం న్యాయ విచారణపై పడుతుందా అన్న అనుమానాలు వస్తున్నాయని చెప్పారు.

స్నాతకోత్సవంలో409 మంది విద్యార్థులకు వివిధ న్యాయ శాస్త్ర పట్టాలను ప్రధానం చేశారు. 49 గోల్డ్ మెడల్స్ ను  ప్రదానం చేయగా LLB విద్యార్థిని తన్వీతహిన 11, కరణ్ గుప్తా, శుభ్రా త్రిపాఠి 6 బంగారు మెడల్స్ చొప్పున అందుకున్నారు. అంధ విద్యార్థి తురబ్‌ చిమ్తనవాలా ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Posted in Uncategorized

Latest Updates