తూత్తుకూడిలో కాల్పులు : ఈ పోలీసులు.. ప్రజలను ఎలా కాలుస్తున్నారో చూడండి

drohi

తమిళనాడు తూత్తుకూడిలో పోలీస్ కాల్పుల్లో 11 మంది చనిపోవటంతో సంచలనం అయ్యింది. 50వేల మంది ఆందోళనకారులు.. 30 వేల మంది పోలీసులు.. 100 రోజులుగా జరుగుతున్న పోరాటం.. 100వ రోజు కలెక్టరేట్ ముట్టడికి ముందుగానే పిలుపు.. అంటే ఆందోళన ఉధృతం అయ్యింది అన్న సంగతి పోలీసులకు ముందే తెలుసు. అందులో భాగంగానే వేలాది మంది పోలీసులను మోహరించారు. ఇక్కడే తమ వ్యూహాన్ని సమర్ధవంతంగా అమలు చేయాల్సి ఉంటుంది భద్రతా బలగాలకు. తప్పు ఎక్కడ జరిగిందో.. హింస ఎలా చెలరేగిందో తెలియదు కానీ.. పోలీసులు జరుపుతున్న కాల్పులు వీడియోలో రికార్డ్ అయ్యాయి. వారు ప్రవర్తించిన తీరు.. ఒక్కడిని అయినా కాల్చి చంపితేనే ఆందోళన అదుపులోకి వస్తుందన్న వారి భావన తీవ్ర కలకలం రేపుతోంది. పోలీస్ కాల్పులకు సంబంధించి బయటకు వచ్చిన వీడియోపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఆందోళనలు అదుపులోకి రావాలంటే.. హింస తగ్గాలంటే కాల్పులు జరపాల్సిందే అని అధికారులు ఆదేశించినట్లు తెలుస్తోంది. కనీసం ఒక్కడైనా చావాలి అంటూ పక్కన ఉన్న పోలీసులు అనటం ఆ వీడియోలో వినిపిస్తోంది. అందులో భాగంగా ఓ పోలీస్.. వ్యాన్ పైకి చకచకా ఎక్కుతాడు. వ్యాన్ పై పడుకుంటాడు.. తుపాకీ తీస్తాడు.. గురి పెడతాడు.. కాలుస్తాడు.. ఈ పోలీస్ జరిపిన కాల్పుల్లో ఎవరైనా చనిపోయారో లేదో గానీ.. అక్కడ పోలీసులు కాల్పులపై వ్యవహరించిన తీరు విమర్శల పాలవుతుంది. ఓ మనిషిని కాల్చి చంపటం అంటే మామూలు విషయం కాదు.. అతడి ప్రాణాలను తూటాలతో తీయటం అంటే ఎంతో ఆలోచించాలి. అలాంటిది పోలీసులు.. ఇక్కడ యదేచ్ఛగా కాల్పులకు తెగబడ్డారు అంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. పోలీస్ వ్యాన్లు ఎక్కి, విచక్షణారహితంగా కాల్పులు జరపారంటూ ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ కాల్పుల వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టటంతో.. తమిళనాడు ప్రభుత్వం స్పందించింది. పోలీస్ కాల్పులపై జ్యుడిషియల్ ఎంక్వయిరీకి ఆదేశించింది.

Posted in Uncategorized

Latest Updates