తెప్పోత్సవాలకు TTD భారీ ఏర్పాట్లు

ttd-531x398తిరుమల క్షేత్రం మరో ఉత్సవానికి సిద్ధమైంది. వెంకన్న వేసవి తాపం తీర్చేందుకు.. పుష్కరిణిలో కన్నుల పండువగా తెప్పోత్సవాలు జరగనున్నాయి. ఈనెల 25 నుంచి మార్చ్ 1వ తేదీ వరకు ఐదురోజులపాటు జరిగే తెప్పోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది టీటీడీ. తెప్పోత్సవాల సందర్భంగా శ్రీవారి ఆలయంలో నిర్వహించే పలు అర్జితసేవలను రద్దుచేసింది.

ప్రతిఏటా స్వామివారికి పాల్గుణ మాసంలో.. శుద్ధ ఏకాదశినాడు ప్రారంభమయ్యే తెప్పోత్సవాలు.. పౌర్ణమి వరకు ఘనంగా జరుగుతాయి. వేసవి ప్రారంభంలో పున్నమి రోజుల నాటి వెన్నెల కాంతుల్లో.. స్వామివారిని ఊరేగించే తెప్పోత్సవాలు భక్తులకు కనువిందు చేస్తాయి. వివిధ అవతారాల్లో ఉభయ దేవేరుల సమేతంగా విహరిస్తారు స్వామివారు. తెప్పోత్సవాల్లో మొదటిరోజు 25న శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సమేతంగా.. శ్రీరామచంద్రమూర్తి అవతారంలో స్వామివారు పుష్కరిణిలో తెప్పలపై దర్శనమిస్తారు. రెండో రోజు 26 ద్వాదశినాడు.. రుక్మిణీ సమేతంగా శ్రీకష్ణస్వామి అవతారంలో విహరిస్తారు. మూడోరోజు 27 త్రయోదశినాడు శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామి మూడుసార్లు విహరించి భక్తులను అనుగ్రహిస్తారు. నాలుగో రోజు 28న ఐదుసార్లు, చివరి రోజు మర్చి 1న ఏడుసార్లు తెప్పపై పుష్కరిణిలో విహరించి భక్తులను కటాక్షిస్తారు మలయప్పస్వామి.

ఉత్సవాల సందర్భంగా పుష్కరిణి చుట్టూ విద్యుత్ దీపాలతో అందంగా అలంకరణలు చేయించారు టీటీడీ అధికారులు. తెప్పోత్సవాల సందర్భంగా ఈనెల 25, 26 వ తేదీల్లో వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలు, 27, 28, మార్చి1 వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేశారు అధికారులు.

Posted in Uncategorized

Latest Updates