తెలంగాణను వణికించిన చలి : 26 మంది మృతి

హైదరాబాద్ :  విపరీతమైన చలిని తట్టుకోలేక గత నాలుగు రోజుల నుంచి రాష్ట్రంలో 26 మంది చనిపోయారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో నిన్న(బుధవారం) ఒక్కరోజే ఏడుగురు చనిపోయారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఆరుగురు వృద్ధులు మృతి చెందారు. ధర్మసాగర్‌ మండలం ఉనికిచర్లకు చెందిన పెద్ది కేశవరెడ్డి(70), ఐనవోలు మండలం ముల్కలగూడేనికి చెందిన మండల కుమారస్వామి(60), గర్మిళ్లపల్లికి చెందిన మచ్చ లచ్చమ్మ(75), కురవి మండలం కాంపల్లి శివారు బిల్యానాయక్‌ తండాకు చెందిన బానోత్ పోరి(60), శాయంపేట మండలం ప్రగతి సింగారంకు చెందిన లోకలబోయిన సారయ్య(92), కొలగాని మల్లయ్య(96) చలి తీవ్రతను తట్టుకోలేక చనిపోయారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఐదుగురు వృద్ధులు మృతి చెందారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలానికి చెందిన బాడిశ వెంకటేశ్వర్లు(65), అశ్వారావుపేట మండలం వేల్పుల వీరస్వామి(55), బూర్గంపాడు మండలానికి చెందిన పుట్టి పిచ్చయ్య(72), కొండపర్తి వెంకటయ్య(70), తల్లాడ మండలానికి చెందిన సుంకర గోపమ్మ(75) తీవ్రమైన చలిని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో నలుగురు మృతిచెందారు. జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషనులో భిక్షాటన చేసే ఓ వృద్ధుడు, వృద్ధురాలు నిన్న మృతి చెందారు. తిమ్మాజిపేట మండలం కోడుపర్తిలో ఆంజనేయులు(60) చలి తీవ్రతకు చనిపోయాడు. తెలకపల్లిలో మిషన్‌ కాకతీయ పనుల్లో పనిచేస్తున్న ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని రాయవరానికి చెందిన వడ్డె సుబ్బారావు(33) మరణించాడు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇద్దరు మృతిచెందారు. నాంపల్లి మండలం సుంకిశాలకు చెందిన బుడిగపాక చంద్రయ్య(60), నేరడుగొమ్ము మండలం పెద్దమునిగల్‌కు చెందిన ధర్మబోయిన కమలమ్మ(55) చనిపోయారు. వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలం కడ్మూరుకు చెందిన బేగరి అనంతయ్య(85), రాకంచర్లకు చెందిన చేవెళ్ల అంతమ్మ(65) చలిని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయారు.

Posted in Uncategorized

Latest Updates