తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షం..పంటనష్టం

RAINఅకాల వర్షాలు రాష్ట్ర రైతులను నిండా ముంచుతున్నాయి. నిన్న ఇవాళ కురిసిన వర్షంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చేతికొచ్చిన పంట నీళ్లపాలు అయ్యింది. మరోవైపు ఆసీఫాబాద్ జిల్లాల్లో పిడుగు పాటుకు ఒకరు చనిపోయారు. అయితే ద్రోణి ప్రభావంతో మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందటున్నారు అధికారులు. రాష్ట్రంలో వాతావరణం చల్లబడింది. గత రెండు రోజులతో పోలిస్తే…బుధవారం (మే-23) ఉష్ణోగ్రతలు కాస్త తగ్గాయి. మరోవైపు ఉత్తర తెలంగాణలో నిన్న, ఇవాళ పలు చోట్ల వర్షాలు కురిశాయి. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలో కురిసిన వర్షాలకు పంట నష్టం జరిగింది. కొమురంభీం జిల్లాలో ఈదురు గాలులతో పాటు వడగళ్ల వాన పడింది. కాగజ్ నగర్, సిర్పూర్ మండలాలలో పిడుగులు పడి రెండు పశువులు చనిపోయాయి.

ఆదిలాబాద్ జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట, దండెపల్లి, జన్నారం మండలాల్లో కురిసిన అకాలవర్షానికి కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యం తడిసి ముద్దైంది. అకాల వర్షం జగిత్యాల జిల్లాలో అన్నదాతలకు కష్టాలు తెచ్చింది. గోనె సంచులు సకాలంలో అందకపోవటంతో పంట నీటిపాలైంది. మెట్ పల్లి మండలం జగ్గసాగర్ లో పిడుగుపాటుకు ఓ వ్యక్తి చనిపోయాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వానతో వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవాలయ పరిసరాలు జలమయమయ్యాయి.

అకాల వర్షంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలుగా నమోదయ్యాయి. మరోవైపు మధ్యప్రదేశ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

అటు ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లాలో సాయంత్రం వాతవరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. అయితే ఆలూరులో పిడుగు పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.

Posted in Uncategorized

Latest Updates