తెలంగాణలో బీ హబ్‌ : మంత్రి కేటీఆర్

బయోటెక్నాలజీ, బయోఫార్మా రంగాల అభివృద్ధి కోసం తెలంగాణలో ప్రత్యేకంగా బీ హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు మంత్రి కేటీఆర్. బేగంపేట క్యాంపు కార్యాలయంలో నిన్న(మంగళవారం) జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో ఆయన  మాట్లాడుతూ త్వరలో రూ.60 కోట్ల వ్యయంతో బీ హబ్ ప్రాజెక్టు నెలకొల్పుతున్నామన్నారు. బయోఫార్మా, బయోటెక్ రంగాల్లో పరిశోధనలకు ఊతమిచ్చేందుకు బీ హబ్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు కేటీఆర్. ప్రైవేట్, పబ్లిక్ భాగస్వామ్యంతో హైదరాబాద్‌లోని జీనోమ్‌ వ్యాలీలో బీహబ్‌ను ఏర్పాటుచేస్తామని, దీనిద్వారా 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో పరిశోధనశాలతోపాటు ఇంక్యుబేటర్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

బీహబ్ ఏర్పాటుతో రాష్ట్ర బయోఫార్మా రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని, ద్వారా స్వదేశీ కంపెనీలకు బయోఫార్మా రంగంలో ముందున్న కొరియా, చైనా, ఫ్రాన్స్ లాంటి దేశాల స్థాయి పరిశోధన, తయారీ సౌకర్యాలు అందుబాటులోకి రావడంతోపాటు లైఫ్‌ సైన్సెస్ రాజధానిగా హైదరాబాద్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుందన్నారు కేటీఆర్. బయోఫార్మా రంగలో పరిశోధనలను కొనసాగిస్తూ ఉత్పత్తి ప్రక్రియలోకి బీహబ్ ఉపయుక్తంగా ఉంటుందని, ఫార్మా కంపెనీలకు బిజినెస్‌ ప్లానింగ్, సెల్‌లైన్ డెవలప్‌మెంట్, ప్రాసెస్ డెవలప్‌మెంట్, రిస్క్ అసెస్‌మెంట్ వంటి అనేక అంశాలకు కావాల్సిన వనరులు ఇందులో అందుబాటులో ఉంటాయన్నారు.

ఆసియా ఖండంలోనే ఎంతో వాసికెక్కిన జినోమ్‌వ్యాలీలో ఇప్పటికే 200 బయోఫార్మా కంపెనీలు కార్యకలాపాలను విస్తరించుకుంటున్నాయని చెప్పారు కేటీఆర్. కామన్ స్కేల్‌అప్, మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ బీహబ్ ద్వారా లభిస్తాయని, ఉత్పత్తులను మార్కెట్ చేసుకునేందుకు బీహబ్ ఎంతో అనువుగా ఉంటుందన్నారు ఆయన. ఇప్పటికే హైదరాబాద్ వ్యాక్సిన్‌ హబ్ ఆఫ్ ఇండియాగా పేరు గడించిందని, రానున్న పదేండ్లలో 4 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించడంతోపాటు 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్‌లోని ఫార్మాసిటీ, మెడికల్ డివైసెస్ పార్కు, లైఫ్‌సైన్సెస్ ఇన్‌ఫ్రాక్చర్ ఫండ్ లాంటి అనేక ప్రాజెక్టులకు బీహబ్ ఊతమివ్వడంతోపాటు ప్రభుత్వ లక్ష్యాలను అందుకోవడంలో ఉపయోగపడగలదన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. ఈ సమావేశంలో పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీ నరసింహారెడ్డి, లైఫ్‌సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్, పాల్గొన్నారు.

Posted in Uncategorized

Latest Updates