తెలంగాణ గురుకులాలకు కేరళ బృందం ప్రశంస

రాష్ట్రంలో గురుకులాల ద్వారా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడం అభినందనీయమన్నారు కేరళకు చెందిన కోజికోడ్ ఎమ్మెల్యే ప్రదీప్‌కుమార్. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు గురుకులాలను నిన్న(శుక్రవారం) కేరళ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా సూపర్ సీరియస్ లెక్చర్ సిరీస్, ఈ ప్లస్ క్లబ్స్, ఆపరేషన్ బ్లూక్రిస్టల్, వాయిస్‌ఆఫ్ గల్స్ వంటి అంశాలపై గురుకుల విద్యార్థులు నిర్వహించిన ప్రదర్శనలను తిలకించి సంతృప్తి వ్యక్తంచేశారు. నాణ్యమైన విద్యకు గురుకులాలు సాక్ష్యంగా నిలుస్తున్నాయని కొనియాడారు ప్రదీప్‌కుమార్. విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడానికి ఇదే సరైన మార్గమని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఐఐటీ, ఎన్‌ఐటీ, మెడికల్ కాలేజీలతోపాటు దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకమైన యూనివర్సిటీల్లో విద్యార్థులు సీట్లు పొందాలన్న లక్ష్యంతో రాష్ట్రంలోని గురుకులాలు పనిచేస్తున్నాయని ప్రశంసించారు కేరళ బృందంలోని సభ్యులు. ఈ సందర్భంగా కేరళ బృందంలోని సభ్యులు సంక్షేమశాఖ గురుకులాల కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను కలిశారు. అట్టడుగువర్గాల విద్యార్థుల అభ్యున్నతి కోసం కృషిచేస్తున్నారని ఆయనను అభినందించింది కేరళ బృందం.

Posted in Uncategorized

Latest Updates