తెలంగాణ పల్లెల్లో బొడ్డెమ్మ సంబురం ప్రారంభం

హైదరాబాద్ : బొడ్డెమ్మ.. బొడ్డెమ్మ కోల్… బిడ్డాలెందరో కోల్.. పాటలు తెలంగాణ పల్లెపల్లెనా మార్మోగుతున్నాయి. చిన్న బతుకమ్మ పండుగ కు తొమ్మిదిరోజుల ముందే తెలంగాణలో బొడ్డెమ్మ వేడుకలు మొదలవుతాయి. సోమవారం నుంచే బొడ్డెమ్మ సందడి మొదలైంది. పీటపై మట్టితో చేసిన బొడ్డెమ్మను పెట్టి.. పూలతో అలంకరించి.. ఎర్రమట్టి(జాజు)తో చుట్టూ అలికి.. బొడ్డెమ్మ పాటలు పాడుతున్నారు మన ఆడపడుచులు.

బొడ్డెమ్మ మట్టితో ముడిపడి ఉన్న పండుగ. పెళ్లి కాని అమ్మాయిలు పుట్ట మన్నును తీసుకొచ్చి… శ్రీ చక్రాకారంలో బొడ్డెమ్మను తయారుచేసి పూలతో అలంకరించి పూజిస్తారు. మట్టిని అమ్మగా కొలుస్తారు. వ్యవసాయానికి గుర్తుగా.. మట్టి ముద్దను బొడ్డెమ్మగా మలిచి, గౌరమ్మగా పూజిస్తారు.

మంచి భర్త రావాలంటూ… తొమ్మిది రోజులపాటు సాయంత్రం వేళ యువతులు ఉత్సాహంగా బొడ్డెమ్మకు పూజలు చేస్తారు. పసుపు, కుంకుమలతో బొడ్డెమ్మపై ముగ్గులు వేస్తారు. అప్పుడే తెంపిన పూలతో బొడ్డెమ్మను అలంకరిస్తారు.

బతుకమ్మ పండుగ సరిగ్గా భాద్రపద అమావాస్య రోజున వస్తుంది. దీనినే పెత్తరమాస అంటాం. చనిపోయిన పెద్దలకు ఆరోజున బియ్యం ఇస్తుంటారు. చిన్నబతుకమ్మ ప్రారంభమయ్యే వేడుకకే.. ఎంగిలి పూల బతుకమ్మ అని కూడా పేరు. ఆశ్వయుజ మాసం ప్రారంభంతోనే బతుకమ్మ పండుగ కొనసాగుతుంది. మొదటి రోజు బతుకమ్మతో పాటు, బొడ్డెమ్మను చెరువుకు తీసుకెళ్లి.. ప్రసాదంగా తమలాపాకును మాత్రమే పంచుతారు. ఆ తరువాత రోజు నుంచి రోజుకో రకమైన ఫలహారాలను పంచుతారు.

Posted in Uncategorized

Latest Updates