తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం : కేంద్రమంత్రి నఖ్వీ

POCHARAMu

తెలంగాణ ఫథకాలు దేశానికే ఆదర్శం అన్నారు కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ. రాష్ట్రంలో కొత్తగా చేపట్టిన మైనార్టీ గురుకులాల్లో మౌలిక సదుపాయాలను పెంచేందుకు నిధులు మంజూరు చేయాలని కేంద్రానికి రాష్ట్ర వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆయన మంగళవారం (ఫిబ్రవరి-27)  ఢిల్లీలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్‌తో కలిసి కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీతో భేటీ అయ్యారు. తెలంగాణలో మైనార్టీల సంక్షేమ కోసం చేపట్టిన పథకాలను వివరించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి నక్వీ.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రశంసించారు.

మైనార్టీల విద్య, అభివృద్ధి కోసం తెలంగాణ తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు దేశానికే ఆదర్శమని కొనియాడారు. భేటీ అనంతరం మంత్రి పోచారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని కోటగిరి, బాన్సువాడ, బిచ్కుంద కామారెడ్డి, లింగంపేటలోని మైనార్టీ రెసిడెన్షియల్ విద్యాలయాల్లో మౌలిక వసతులు పెంచేందుకు నిధులివ్వాల్సిందిగా కోరామని, బాన్సువాడలో మైనార్టీ ఉర్దూ డిగ్రీ కాలేజీ మంజూరు చేయాలని, మల్టీ సెక్టోరియల్ డెవలప్‌మెంట్ కార్యక్రమం కింద మైనార్టీ విద్యాసంస్థల్లో మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశామని తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates