తెలంగాణ వర్శిటీలు పటిష్టం: కడియం

KADIYAMరాష్ట్రప్రభుత్వం తెలంగాణలోని వర్శిటీలను పటిష్టం చేస్తోందన్నారు డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి. యూనివర్శిటీల్లో 1551 ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేసేందుకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారన్నారు.  హైదరాబాద్ లో తెలుగు యూనివర్శిటీ పరిపాలనా భవనం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు కడియం శ్రీహరి. యూనివర్శిటీల్లో మౌలిక వసతుల కోసం 420 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. తెలుగు యూనివర్శిటీకి బిల్డింగ్ గ్రాంట్ కింద 20 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. సోమవారం(ఫిబ్రవరి-5) పరిపాలన భవనం కోసం 3.4 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసినట్లు మంత్రి తెలిపారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చడంలో విద్యాశాఖ పాత్ర  కీలకమైందని, ఉన్నత ప్రమాణాలు కలిగిన విద్యను అందించడంతో మానవ వనరుల అభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు కడియం.

మూడేళ్లగా విద్యా వ్యవస్థలో సంస్కరణలు తెస్తున్నామన్నారు మంత్రి కడియం శ్రీహరి. ఇంజనీరింగ్ కాలేజీలను, ప్రైవేట్ విద్యాలయాలను నియంత్రిస్తున్నామన్నారు. ఉత్తీర్ణుల కంటే ఎక్కువగా కాలేజీలలో సీట్లు ఉండడాన్ని రెగ్యులేట్ చేశామని తెలిపారు. గతంలో ఇష్టారాజ్యంగా కాలేజీలకు అనుమతి ఇవ్వడం కారణంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ప్రమాణాలు తగ్గాయన్నారు. తెలంగాణ వచ్చాక ఆన్ లైన్ అడ్మిషన్లు చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో చదివే విద్యార్థి 1 నుంచి 12 వరకు తెలుగు నేర్చుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని…. దీని కార్యాచరణ కోసం తెలుగు యూనివర్శిటీ వీసీ సత్యనారాయణ చైర్మన్ గా కమిటీ వేశామని తెలిపారు. తెలంగాణలో చదివే ప్రతి విద్యార్థి తెలుగు చదవాలి, రాయాలి, మాట్లాడాలన్నారు. అందుకే తెలుగును సులభతరంగా మార్చే సిలబస్ రూపొందిస్తున్నామని తెలిపారు మంత్రి కడియం.

Posted in Uncategorized

Latest Updates