తేడా వస్తోంది : రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో తనిఖీలు

బండి నడవాలంటేనే కాదు.. జీవితం సాఫీగా సాగాలంటే పెట్రోల్, డీజిల్ ఉండాల్సింది. ఒక్క రోజు బంకుల బంద్ అయితేనే అల్లకల్లోలం. అలాంటి పెట్రోల్ బంకుల్లో తేడా వస్తే.. కోట్లలో వినియోగదారులు నష్టపోతారు. ఇప్పటికే మీటర్ రీడింగ్ ట్యాంపరింగ్ చేస్తూ.. కల్తీలు చూస్తే జేబులు గుళ్ల చేస్తున్న ఘటనలు బోలెడు వస్తున్నాయి. అదే విధంగా వినియోగదారులు నుంచి ఆయా బంకుల్లో మోసాలపైనా కంప్లయింట్స్ వెల్లువెత్తుతున్నాయి. వీటిపై దృష్టి పెట్టిన తూనికలు, కొలతల శాఖ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో తనిఖీలు నిర్వహించింది. 70 బంకుల్లో తనిఖీలు చేయగా.. నిబంధనలు ఉల్లంఘించిన 15 బంకులపై కేసులు నమోదు చేశారు. 12 బంకుల్లో డీజిల్‌ తక్కువగా పోస్తుండటంతోనూ , లైసెన్స్‌ రెన్యువల్‌ చేసుకోని మరో 3 బంకులపై కేసులు నమోదు చేశారు.

ఇక గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని ఉప్పల్‌ దగ్గర ఉన్న ఐడీపీఎల్‌ ఫార్చ్యూన్‌ ఫ్యుయల్‌ హెచ్‌పీసీ పెట్రోల్‌ బంకులో మోసం బయటపడింది. 5 లీటర్ల డీజిల్‌కు 300 ఎంఎల్‌ తక్కువగా పోస్తున్నారని గుర్తించారు. దీంతో కేసు నమోదు చేశారు. మరికొన్ని పెట్రోల్ బంకుల్లోనూ తనిఖీలు నిర్వహించారు. మరో రెండు, మూడు రోజులు ఈ దాడులు కొనసాగుతాయని.. మోసాలకు పాల్పడితే చర్యలు కఠినంగా ఉంటాయని అధికారులు వెల్లడించారు.

Posted in Uncategorized

Latest Updates