తొక్కలూ తినొచ్చు

పండ్లు, దుంపలు, కూరగాయల్లో తొక్క తీసేసి తింటారు. దీనికి కారణం పరిశుభ్రత ఒకటైతే..మరో కారణం రసాయన ఎరువుల వాడకంతో పండిస్తున్న పంటలు. ఈ ఆహారపదార్థాలను వండే ముందు ఉప్పుతో కడిగితే రసాయనాల అవశేషాలు తొలగించవచ్చు.కానీ,పైనున్న తొక్కను తొలగించి తినడం వల్ల ఆరోగ్యానికి అందాల్సిన కొన్ని ప్రయోజనాలను దూరం చేసుకున్నట్టే. నిజానికి తొక్కల్లో చాలా పోషక పదార్థాలు ఉంటాయి. వాటిని వివిధ రూపాల్లో ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు.

నారింజ, నిమ్మలో మోనోటెర్ పాన్స్..

నోటికి ఏ రుచి సహించనప్పుడు నిమ్మకాయ, చింతకాయ పచ్చడి తినాలనిపిస్తుంది. రుచి కంటే వీటికుండే వాసనే ఇందుకు సగం కారణం. నిమ్మ,నారింజ చెక్కులో ఉండే మోనోటెర్ పాన్స్‌ నూనెలు ప్రత్యేక వాసనలు వెదజల్లుతాయి. వీటికి చర్మ, కాలేయ, గర్భాశయ, ఊపిరితిత్తుల క్యాన్సర్లని నివారించే శక్తి ఉంది. పచ్చళ్ల రూపంలో ఇప్పటికే వీటిని తింటున్నాం. పచ్చళ్లు వద్దనుకునే వాళ్లు నిమ్మ తొక్కలతో చేసిన టీ తాగొచ్చు. కేకులు, సలాడ్స్​లో లెమన్‌ పీల్‌ పొడి చల్లుకున్నా రుచిగా ఉంటుంది. పదార్థాలను ఉడికిం చేటప్పుడు, మఫిన్స్‌, బిస్కట్లలో కూడా ఈ పౌడర్‌ వాడుతుంటారు.

పుచ్చకాయ ముక్కల్లో ..

పుచ్చకాయ ముక్కలు అంటే ఎర్రని గుజ్టు ఉంటుందనుకుంటాం . కానీ, ముక్కల అడుగున ఉండే తెల్లని పదార్థం లో పోషకాలు పుష్కలం. దాన్లో సిట్రులిన్‌ అనే పోషక పదార్థం ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచే అమినోయాసిడ్లు,విటమిన్‌ సీ,  విటమిన్‌ ఏ, థయామిన్‌, రైబోఫ్లెవిన్ తో పాటు రక్తహీనత రాకుండా చూసే ఐరన్ , మెగ్నీషియమ్‌,క్యాల్షియం ఉంటాయి. పోషకాలు అపారం కాబట్టి జ్యూస్‌ చేసేప్పుడు కాస్త లోతుగా కట్‌ చేయడం వల్ల తెలుపు రంగు పదార్థాన్నీ మిక్సీలో వేయొచ్చు.

దానిమ్మలో..

ఎర్రని దానిమ్మ గిం జల్లో కంటే దాని పొట్టులో రెండు రెట్లు శక్తివంతమైన పోషకాలుంటాయి. అయితే,వగరుగా ఉండే పొట్టుని ఎవ్వరూ తినరు. అందుకే దానిని ఎండబెట్టి పొడిచేసి..టీ చేసుకోవచ్చు. తీపి గుమ్మడి కాయ తొక్కలో యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు అధికం. బంగాళదుం పలపై ఉండే పొరలో విటమిన్‌ సీ, బీ6, పొటాషియమ్‌, మాంగనీస్‌ లాంటి పోషకాలు చాలా ఉంటాయి. అందుకే ఆలూతో చేసే వంటల్లో సాధ్యమైనంత వరకూ పొట్టు తీయకుండా ఉంటే సరిపోతుంది.

Latest Updates