తొలిసారి రావణ వేషం.. అనాధ అయిన కుటుంబం

పంజాబ్ : అమృత్ సర్ రైలు ప్రమాదం ఎంతో మంది జీవితాల్లో చీకటిని మిగిల్చింది. పొట్ట కూటి కోసం నాటకాల్లో వేషాలేసుకుని బతికేవాళ్ల కుటుంబాలను వీధిన పడేసింది. రావణుడి వేషం వేసిన దల్బీర్‌ సింగ్‌ అనే వ్యక్తి.. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. వేషాలు వేసుకుని తల్లితో పాటు… భార్య, ఎనిమిది నెలల చిన్నారిని పోషిస్తున్నాడు దల్బీర్ సింగ్. రైలు మృత్యువు రూపంలో దూసుకురావడంతో… ఆ కుటుంబం ఇపుడు ఇంటి పెద్ద దిక్కును కోల్పోయింది.

తన కొడుకు దసరా సందర్భంగా వేసే రామ్ లీలా నాటికల్లో చాలా పాత్రలు వేశాడని దల్బీర్ సింగ్ తల్లి స్వరణ్ కౌర్ చెప్పింది. ఇప్పటివరకు రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు వేషాలు వేశాడని చెప్పింది. మొట్టమొదటిసారిగా రావణుడి వేషం వేశాడని… ఇంత దారుణం జరిగిందని చెబుతూ బాధపడింది.

దల్బీర్ మృతి కారణంగా.. తమ కుటుంబం దిక్కులేనిదయ్యిందని ఆమె బాధపడుతోంది. భార్య, చిన్న కూతురు దిక్కులేని వారయ్యారని అధికారులను న్యాయం కోసం వేడుకుంది. వారిని ఆదుకునేందుకు దల్బీర్ భార్యకు ప్రభుత్వమే ఓ ఉద్యోగం ఇప్పించాలని ప్రాధేయపడింది.

ప్రమాదం జరగడానికి ముందు రైలు ట్రాక్ దగ్గరే దల్బీర్ ఉన్నాడని అతడి సోదరుడు బల్బీర్ చెప్పాడు. తన వస్తువులన్నీ తీసుకుని వస్తుండగా.. రైలు వచ్చే సంగతి తెల్సుకుని.. కొంతమంది పిల్లలను ట్రాక్ పైనుంచి పక్కకు నెట్టేసి కాపాడాడని… ఈలోగా రైలు ఢీకొనేసరికి ప్రాణాలు కోల్పోయాడని చెప్పాడు.

అమృత్‌సర్‌లోని జోడా పాఠక్‌ ఏరియాలో… రైల్వే క్రాసింగ్‌ దగ్గర నిర్వహించిన రావణ దహన కార్యక్రమంలో విషాదం జరిగింది. రావణుడి దిష్టి బొమ్మను వెలిగించగానే.. అది మీద పడుతుందేమోనని కొందరు రైలు పట్టాలపైకి పరుగులు తీశారు. అదే సమయానికి రెండు వేర్వేరు పట్టాలపై రెండు రైళ్లు ఎదురెదురుగా రావడంతో జనం భయాందోళనకు లోనయ్యారు. ఎటు వెళ్లాలో తేల్చుకోలేకపోయారు. క్షణాల్లోనే రైళ్లు వారి పైనుంచి దూసుకుపోయాయి. పదుల సంఖ్యలో జనం ప్రాణాలుకోల్పోయారు.

Posted in Uncategorized

Latest Updates