త్రిపురలో కొనసాగుతోన్న పోలింగ్

Tripura-Assembly-Elections-త్రిపురలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం 9 గంటల వరకే 11 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 6 గంటల నుంచే అన్ని పోలింగ్ బూత్ లకు ఓటర్లు బారులు తీరారు. ఈసారి రికార్డు స్థాయి పోలింగ్ నమోదయ్యే అవకాశముందని ముందు నుంచే అంచనాలున్నాయి. దానికితగ్గట్టే ఓటింగ్ జరుగుతోంది. త్రిపురలో 25 ఏళ్లుగా సీపీఎందే అధికారం. రెండు దశాబ్దాలుగా పాలిస్తున్న మాణిక్ సర్కార్ కు ఈసారి బీజేపీ గట్టి సవాలే విసురుతోంది. మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు గాను 59 స్థానాలకు పోలింగ్ జరగుతోంది. చారిలా సెగ్మెంట్ లో సీపీఎం అభ్యర్థి చనిపోవడంతో… దాన్ని మార్చి 12కు వాయిదా వేసింది ఈసీ.

మొత్తం 59 స్థానాలకు 307 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సీపీఎం 57 స్థానాలకు పోటీచేస్తుండగా… RSP, ఫార్వర్డ్ బ్లాక్, CPM ఒక్కో స్థానానికి పోటీపడుతున్నాయి. బీజేపీ మొత్తం 51 స్థానాల్లో తన అభ్యర్థులను నిలబెట్టింది. బీజేపీ భాగస్వామ్య పార్టీ IPFT తొమ్మిది స్థానాల్లో పోటీపడుతోంది. త్రిపురలో సోలోగా పోటీచేస్తున్న కాంగ్రెస్.. 59 స్థానాలకు అభ్యర్థులను నిలిపింది. మొత్తం 3 వేల 214 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఎన్నికల సందర్భంగా టైట్ సెక్యూరిటీ ఏర్పాటుచేసింది కేంద్రం. భద్రత కోసం 300 కంపెనీల కేంద్ర బలగాలను మొహరించారు. మొదటి గంటలోనే రికార్డు స్థాయి పోలింగ్ నమోదైంది. మార్చి 3న త్రిపుర ఫలితాలు రాబోతున్నాయి.

సీఎం మాణిక్ సర్కార్.. తన సొంత అసెంబ్లీ నియోజకవర్గం ధన్ పూర్ లోని పోలింగ్ బూత్ లో ఓటేశారు. తన భార్య పాంచాలీ భట్టాచార్యతో కలిసి పోలింగ్ బూత్ కి వచ్చిన సర్కార్.. పోలింగ్ సరళిని పరిశీలించారు. 25 ఏళ్లుగా అధికారంలో ఉన్న సీపీఎం ఈసారి కూడా విజయం సాధిస్తుందని సీఎం భార్య పాంచాలీ భట్టాచార్య ఆశాభావం వ్యక్తం చేశారు. నిజాయితీ, నిరాడంబర జీవితమే ఆయన్ని గెలిపిస్తుందన్నారు. మరోవైపు బీజేపీ త్రిపుర ప్రెసిడెంట్ విప్లవ్ కుమార్ కూడా ఓటేశారు. ఉదయ్ పూర్ లోని 31వ నంబర్ పోలింగ్ బూత్ లో తన ఓటుహక్కు వినియోగించుకున్నారు విప్లవ్. ఇవి చరిత్రాత్మక ఎన్నికలని.. బీజేపీ గెలుస్తుందని ఆశాభావం వక్తం చేశారాయన.

Posted in Uncategorized

Latest Updates