త్వరలో సింగరేణిలో లాభాల బోనస్

తెలంగాణకే తలమానికమైన సింగరేణి బొగ్గుగనుల్లో త్వరలోలాభాల బోనస్ వస్తుంది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి నల్లబంగారం రూ.1,212 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. అన్నిరకాల పన్నులు పోగా నికరంగా వచ్చిన ఈ ఆదాయంలో నుంచి కార్మికులకు ఇచ్చే లాభాలవాటా(ప్రాఫిట్ బోనస్)పై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సంప్రదించి, త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్. అంతక్రితం ఏడాది రూ.395 కోట్ల లాభం ఆర్జించింది. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో బుధవారం 545వ బోర్డు సమావేశమై ఈ ఆర్థిక ఫలితాలకు ఆమోదముద్ర వేసింది. ఈ సమావేశంలో సింగరేణికి సంబంధించిన పలు ఆర్థికాంశాలకు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కార్మికులు, అధికారులు, సీనియర్ స్థాయి సిబ్బంది సమిష్ఠి కృషి ఫలితంగానే గడిచిన ఆర్థిక సంవత్సరంలో సింగరేణి అత్యధిక లాభాలు ఆర్జించామని, ఇదే ఒరవడిని ఈ ఏడాది కూడా కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేశారు శ్రీధర్. లక్ష్యాల సాధనకు కష్టపడిన కార్మికవర్గానికి మంచి లాభాల వాటాతోపాటు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను కూడా అమలు చేస్తామన్నారు ఆయన.

సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు సింగరేణివ్యాప్తంగా ఉన్న కార్మిక కాలనీల్లోని నివాస గృహాలన్నింటికీ ఏసీ కనెక్షన్లు ఇవ్వడానికి రూ.60 కోట్ల వ్యయంతో వచ్చిన ప్రతిపాదనలకు బోర్డు ఆమోదం తెలిపింది. ఈ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని, అన్ని క్వార్టర్లకు ఏసీల ఏర్పాటుకు, కనెక్షన్లు ఇవ్వడానికి ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు, వైరింగ్, స్విచ్‌బోర్డుల ఏర్పాటు వంటివి త్వరితగతిన పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు సింగరేణి సీ అండ్ ఎండీ శ్రీధర్. అలాగే వివిధ ఓసీ గనులు, భూగర్భ గనులకు సంబంధించిన పనులు, కొనుగోళ్లు తదితర ఆర్థికాంశాల అనుమతులకు కూడా బోర్డు ఆమోదం తెలిపింది. ఈ బోర్డు సమావేశంలో రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి కే రామకృష్ణారావు, సింగరేణి డైరెక్టర్లు ఎస్ శంకర్, చంద్రశేఖర్, డబ్ల్యూసీఎల్ సీఎండీ ఆర్‌ఆర్ మిశ్రా, కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ డైరెక్టర్ సయూద్ అష్రఫ్, జనరల్ మేనేజర్ (ఎఫ్ అండ్ ఏ) ఎం నర్సింహారెడ్డి, కంపెనీ వ్యవహారాల కార్యదర్శి గుండా శ్రీనివాస్ పాల్గొన్నారు.

Posted in Uncategorized

Latest Updates