థియేటర్లలో అసలు ధరకే స్నాక్స్ : అకున్ సబర్వాల్

సినిమా థియేటర్ కి వెళ్తే చాలు..టికెట్ కంటే తినుబండారాలకే ఖర్చు ఎక్కువ అవుతుంది. పాప్ కార్న్, టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ పై MRP కంటే డబుల్ రేట్స్ కనిపిస్తాయి. మల్లీప్లెక్స్ లో అయితే వీటి ధరలు మరింత ఎక్కువగా ఉంటాయి. అయితే దీనికి ఫుల్ స్టాప్ పెట్టనున్నారు. ఇకనుంచి సినిమా చూస్తూ అసలు ధరలకే మీకు ఇష్టమైన పదార్దాలను తింటూ ఎంజాయ్ చేయవచ్చు. సినిమా థియేటర్లలో పదార్థాలపై MRP కంటే అధికంగా వసూలు చేయరాదని రాష్ట్ర తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్‌ అకున్ సబర్వాల్ స్పష్టం చేశారు. మంగళవారం(జూలై-17) మల్టీప్లెక్స్ సినిమా థియేటర్ల యజమానులతో అకున్ సబర్వాల్ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో అకున్ సబర్వాల్ మాట్లాడుతూ..MRP కంటే అధికంగా వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి పదార్థం బరువును స్పష్టంగా ప్రదర్శించాలి. కొనుగోలు చేసే ప్రతి పదార్థానికి బిల్లు తప్పనిసరి. జూలై 24 వరకు ధర, పరిమాణానికి సంబంధించిన స్టిక్కర్లు, అతికించుకోవచ్చన్నారు. సెప్టెంబర్ 1నుంచి పదార్థాలపై ఖచ్చితమైన ధర ముద్రించాలని యజమానులకు నిర్దేశించారు. బోర్డుపై కూడా స్పష్టంగా ధరలు కనిపించేలా ఉండాలని, వినియోగదారుల చట్టం ప్రకారం ప్రతి వస్తువు విక్రయానికి సంబంధించి వినియోగదారునికి కచ్చితంగా బిల్లు ఇవ్వాలని ఆదేశించారు. అధిక ధరలు వసూలు చేస్తే .. వాట్సప్‌ నంబర్‌ 7330774444కు ఫిర్యాదు చేయవచ్చన్నారు.

Posted in Uncategorized

Latest Updates