థ్యాంక్ గాడ్ : బోరుబావిలోని చిన్నారి నవ్వుతూ వచ్చింది


30 గంటల శ్రమ.. ఒక్క నిమిషం టైం కూడా వేస్ట్ చేయని రెస్క్యూ టీం.. భారీ యంత్రాలతో తవ్వకాలు.. స్థానికుల సహకారం ఇలా ప్రతి ఒక్కరి సహకారంతో.. 110 అడుగుల లోతున బోరుబావిలో ఉన్న చిన్నారి ప్రాణాలు బయటపడింది. బీహార్ రాష్ట్రం ముంగేర్ లో మూడేళ్ల చిన్నారి సన బోరుబావిలో పడింది. ఇంటిముందు ఆడుకుంటూ పడిపోయింది. 225 అడుగుల లోతు ఉన్న ఈ బోరుబావిలో.. చిన్నారి సన 110 అడుగుల దగ్గర ఇరుక్కుపోయింది. జూలై 31వ తేదీ మంగళవారం మధ్యాహ్నం జరిగింది ఈ ఘటన. 30 గంటల సుదీర్ఘ ఆపరేషన్ తర్వాత.. ఆగస్ట్ ఒకటో తేదీ రాత్రి 10 గంటల సమయంలో బయటకు వచ్చింది చిన్నారి.

బోరుబావిలోని చిన్నారి మరింత జారిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ తర్వాత నిరంతరం ఆక్సిజన్ పంపించారు. చిన్నారి భయపడకుండా ఉండేందుకు ఓ లైట్ కూడా బోరుబావిలోకి వేశారు. అదే విధంగా చిన్నారి తల్లితో మాట్లాడిస్తూనే ఉన్నారు. పాప భయపకుండా, తవ్వకాల ద్వారా వచ్చే శబ్దాలతో బెంబేలెత్తుకుండా ఉండేందుకు తల్లితోపాటు తండ్రితోనూ మాట్లాడిస్తూనే ఉన్నారు. ధైర్యం చెబుతున్నారు. ఓ పక్క ఈ ప్రక్రియ జరుగుతుండగానే.. మరోవైపు అధికారులు ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ చేయలేదు. స్థానికులు కూడా తలా ఓ చేయి వేయటంతో.. బోరుబావికి సమాంతరంగా 110 అడుగుల గొయ్యి తీశారు. అక్కడ నేల కూడా మెత్తగా ఉండటం, రాళ్లు అడ్డురాకపోవటంతో ఆపరేషన్ ఈజీ అయ్యింది. జిల్లా ఎస్పీ, కలెక్టర్ స్పాట్ లోనే ఉండి.. రెస్క్యూ ఆపరేషన్ కు కావాల్సిన అన్నింటిని ఎప్పటికప్పుడు అరేంజ్ చేశారు. ఒకటికి నాలుగు యంత్రాలు, డ్రైవర్లను రప్పించారు.

ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. క్షేమంగా బయటకు వచ్చింది. చిన్నారి నవ్వింది. అందరూ ఊపిరిపీల్చుకున్నారు. థ్యాంక్ గాడ్ అని మనసులోనే దండం పెట్టుకున్నారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. భయంతో ఉందని.. రెండు రోజుల ట్రీట్ మెంట్ తర్వాత ఇంటికి పంపిస్తాం అని డాక్టర్లు వెల్లడించారు. చిన్న చిన్న గాయాలు మాత్రమే అయ్యాయని.. అస్సలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని ప్రకటించారు డాక్టర్లు.

Posted in Uncategorized

Latest Updates