దడ పుట్టిస్తున్న H-1బీ : కొత్త రూల్స్ తో మరిన్ని కష్టాలు

H-1బీ వీసాదారులకు ట్రంప్ షాక్ ఇస్తూనే ఉన్నారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మొదలైన కష్టాలు… H-1బీ వీసాదారులను ఇంకా వీడటం లేదు. అమెరికా మరో కొత్త రూల్‌ తీసుకొచ్చి H-1బీ వీసాదారులకు దడ పుట్టిస్తుంది. వీసా గడువు పొడగింపు లేదా స్టేటస్‌ మార్చుకోవడం తిరస్కరణకు గురైతే, H-1బీ వీసాదారులు దేశ బహిష్కరణ విచారణలను ఎదుర్కొనే.. ఈ కొత్త రూల్‌ వీసా దారులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది.

అమెరికా అథారిటీలు ఇచ్చే గడువు ముగిసినా ..ఇదే రకమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వెల్లడైంది. జూన్‌ 28న అమెరికా ఇమ్మిగ్రేషన్‌ డిపార్ట్‌ మెంట్‌ తీసుకొచ్చిన పాలసీ మెమొరాండమే H-1బీ వీసాదారుల్లో ఈ గుబులు రేపింది. ఈ మెమొరాండం ప్రకారం యునిటెడ్‌ స్టేట్స్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ డిపార్ట్‌మెంట్‌(యూఎస్‌సీఐఎస్‌) నోటీస్‌ టూ అప్పియర్(ఎన్‌టీఏ)‌ ను జారీ చేయడానికి వీలవుతుంది. దీంతో అమెరికాలో ఉంటున్న హెచ్‌-1బీ వీసాదారులను తేలికగా దేశ బహిష్కరణ చేయడానికి వీలవుతుంది. ఇదే ఇప్పుడు ఎన్నారైల్లో ఆందోళన కల్గిస్తోంది.

వీసా పొడిగింపు తిరస్కరణకు గురైనప్పుడు .. వీసా రాకున్నా 240 రోజులు గడువు దాటాక కూడా అమెరికాలో ఉంటే ఇమ్మిగ్రేష‌న్ అధికారుల నుంచి వ‌చ్చే ఈ నోటీసు ప్రకారం కోర్టులో హాజ‌రై స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది. వీసా ప్రక్రియ పూర్తవడానికి సాధారణంగా 180 రోజులు పడుతుంది. ఒకవేళ ఆలస్యంగా దరఖాస్తు చేస్తే.. అది తేలే లోగే వీసా గడువు 240 రోజుల పూర్తవుతుంది. కొత్త నిబంధనల ప్రకారం ఈ గడువు పూర్తయ్యేలోగానే తిరిగి స్వదేశానికి వచ్చేయాలి. ఒకవేళ గడువు పూర్తయినా ద‌ర‌ఖాస్తు వ్యవహారం తేలే వ‌ర‌కు అమెరికాలో ఉంటే తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

వీసా పొడిగింపు దరఖాస్తును అంగీకరిస్తే సరే. లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుస్తోంది. వీసా తిర‌స్కరించిన త‌ర‌వాత అక్కడే ఉంటే.. ఆ వ్యవ‌ధి ఏడాది దాటితే.. వారిపై ప‌దేళ్ళ వ‌ర‌కు మ‌ళ్ళీ అమెరికాలో ప్రవేశించ‌కుండా నిషేధం విధించే అవ‌కాశ‌ముందని తెలిసింది. ఈ నిబంధనలు చూసిన H-1బీ వీసాదారులకు చుక్కలు క‌నిపిస్తున్నాయి. ప్రతిపాదిత కొత్త రూల్స్ విద్యార్థుల‌కూ వ‌ర్తిస్తాయ‌ని తెలియ‌డంతో, అమెరికాలో ఉంటున్న విద్యార్థుల్లో కంగారు మొద‌లైంది.

Posted in Uncategorized

Latest Updates