దత్తతకు తాజ్ : రేసులో దిగ్గజ కార్పొరేట్ సంస్థలు

Taj_Mahal_GMR, ITCప్రేమకు చిహ్నంగా ఉన్న తాజ్ మహల్ ని దత్తతకు ఇవ్వాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం. దీంతో గత సంవత్సరం ప్రవేశపెట్టిన వారసత్వ కట్టడాల దత్తత పథకం కింద తాజ్‌మహల్‌ని కూడా చేర్చింది. ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేసిన తరహాలోనే ఇప్పుడు తాజ్‌మహల్‌ని ఎవరైనా దత్తత తీసుకోవచ్చు. అలా తీసుకున్న వారు తాజ్‌ నిర్వహణ, , పర్యాటకులకు సదుపాయాల కల్పన, వారి భద్రత , తాగునీటి సౌకర్యం, పార్కింగ్‌ సౌకర్యం, పరిశుభ్రత, తాజ్‌ చుట్టూ పచ్చదనాన్ని పెంచడం వంటి చర్యలన్నీ తీసుకోవాలి. ఇప్పటికే తాజ్‌ని దత్తత తీసుకోవడానికి ఎన్నో కార్పొరేట్‌ సంస్థలు ముందుకు వచ్చాయి. వాటిలో GMR గ్రూప్, ITC లిమిటెడ్‌లు రేసులో ముందున్నాయి. తాజ్‌ను దత్తతకిస్తే దాని పరిరక్షణలో ఇక పురావస్తు శాఖ పాత్ర పరిమితమైపోతోంది.

మన దేశంలో ఎన్నో వారసత్వ కట్టడాలు జీర్ణా వస్థకు చేరుకున్నాయి. వాటిని కాపాడుకోవడం పురావస్తు శాఖకు తలకు మించిన భారంగా మారింది. అందుకే మన వారసత్వ సంపదని కాపాడుకోవడానికి మోడీ ప్రభుత్వం 2017 సెప్టెంబర్‌లో ఈ పథకాన్ని మొదలుపెట్టింది. కేంద్ర పర్యాటక శాఖ, పురావస్తు శాఖ సహకారంతో సంయుక్తంగా దీనిని ప్రారంభించాయి. దేశంలో ప్రముఖ కార్పొరేట్‌ కంపెనీలన్నీ ఈ కట్టడాల సంరక్షణను ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. కార్పొరేట్‌ కంపెనీలన్నీ తమకు వచ్చిన లాభాల్లో 2 శాతం సేవా కార్యక్రమాలకు తప్పనిసరిగా ఖర్చు చేయాలి. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబులిటీ బడ్జెట్‌ని చారిత్రక కట్టడాలపై కూడా ఖర్చు చేయాలని కేంద్రం సూచించింది. దేశంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి, చారిత్రక కట్టడాల్లో ప్రపంచస్థాయి సదుపాయాలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రారంభించారు.

Posted in Uncategorized

Latest Updates