దత్తన్న కుమారుడు మృతి : 21 ఏళ్ల కుర్రోడు.. డాక్టర్ చదువుతున్నాడు.. గుండెపోటు ఏంటీ

Heart-Attack21 ఏళ్ల కుర్రోడు.. డాక్టర్ చదువుతున్నాడు.. గుండెపోటు రావటం ఏంటీ.. అప్పటికప్పుడు చనిపోవటం ఏంటీ.. దత్తాత్రేయ కుమారుడు చనిపోయాడా.. నిజమా.. ఎప్పుడు.. ఈ వార్త తెలిసిన వారి అభిప్రాయం ఇదే. దత్తాత్రయే అంటే.. కేంద్ర మాజీ మంత్రిగానే కాకుండా.. ప్రతి ఒక్కరికీ తెలిసిన వ్యక్తి. పార్టీలకు అతీతంగా ప్రతి ఏడాది దసరాకు ఆయన ఇచ్చే అల్లాయ్ – బల్లాయ్ ఆయన వ్యక్తిత్వాన్ని చెబుతోంది. అవినీతి మరక లేదు.. అసలు పొలిటీషియన్ గా కాకుండా.. మన వీధిలోని ఓ పలుకుబడి కలిగిన వ్యక్తిగా చూస్తారు ప్రజలు. అందరిలో ఒకరిగా.. అందరికీ కావాల్సిన వ్యక్తిగా.. వివాదరహితుడుగా అందరి మన్ననలు పొందాడు దత్తన్న. ఆయన ఇంట్లో విషాదం.. అందులోనూ ఏకైక కుమారుడు వైష్ణవ్ మృతి వార్తను నమ్మకలేపోయారు ప్రజలు.

వైష్ణవ్.. వయస్సు 21 ఏళ్లు. MBBS మూడో సంవత్సరం చదువుతున్నాడు. చలాకీగా ఉంటాడు. ఇటీవలే తండ్రి పక్కన ఎక్కువగా కనిపిస్తున్నాడు. తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. తండ్రి వ్యక్తిత్వాన్ని పునికి పుచ్చుకున్నాడు అంటూ దగ్గరి వారు ఎప్పుడూ అంటూ ఉంటారు. ఎలాంటి చెడు అలవాట్లు లేవని.. దత్తన్న లాగే అందరికీ కలిసిపోతాడు అంటూ బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అంటుంటారు. ప్రతి ఒక్కరినీ బాబాయ్, అన్నా వయస్సును బట్టి ఆప్యాయంగా పలకరిస్తుంటాడు అంటారు కార్యకర్తలు, నేతలు. ఇంటికి వచ్చే పార్టీ ప్రముఖులను కూడా రండి అంకుల్ బాగున్నారా అంటూ పలకరిస్తూ.. ఎంతో ఉత్సాహంగా.. ఉల్లాసంగా ఉంటాడని చెబుతున్నారు. అలాంటి కుర్రోడు గుండెపోటుతో.. ఇంత చిన్న వయస్సులో చనిపోవటాన్ని జీర్ణించుకోలేకపోతోంది ఆ కుటుంబం.

మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో భోజనం చేస్తున్నాడు వైష్ణవ్. అన్నం తింటూనే కుప్పకూలిపోయాడు. ఫిట్స్ లక్షణాలు కనిపించాయి. వెంటనే ముషీరాబాద్ లోని గురుననాక్ కేర్ ఆస్పత్రికి తరలించారు. అప్పుడు తెలిసింది.. వచ్చింది ఫిట్స్ కాదని.. గుండెపోటు అని. వెంటనే డాక్టర్ల బృందం రెండు గంటలు వైద్య పరీక్షలు నిర్వహించారు. అయినా ఫలితం దక్కలేదు. అర్థరాత్రి 12.30గంటలకు ప్రాణాలు విడిచాడు వైష్ణవ్. ఆస్పత్రిలో కొడుకు చనిపోయాడు అన్న విషయాన్ని దత్తాత్రేయకు తెల్లవారుజాము వరకు చెప్పలేదు. ఆయన వయస్సు రీత్యా కొంత సమయం దాచి ఉంచారు. ఒక్కగానొక్క కొడుకు.. ఎంతో గారాబంగా.. అల్లారుముద్దుగా పెంచాడు. అలాంటి కొడుకు ఇక లేడు అని.. నిన్నటి వరకు ఎంతో ఆరోగ్యంగా ఉన్న బాబు.. గుండెపోటుతో చనిపోయాడు అని తెలిసి దత్తాత్రేయ కన్నీరుమున్నీరు అవుతున్నారు.

21 ఏళ్ల వయస్సు.. అందులోనూ డాక్టర్ మూడో సంవత్సరం చదువుతున్నాడు.. ఎలాంటి చెడు అలవాట్లు లేవు.. అయినా గుండెపోటుతో చనిపోవటంతో అందరూ షాక్ అవుతున్నారు. ఈ వార్త తెలిసిన ప్రముఖులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. చిన్నప్పటి నుంచీ ఓ సెలబ్రిటీ కుటుంబంలో పుట్టి పెరిగిన కుర్రోడు.. అలాంటి అబ్బాయికే మొదటిసారి వచ్చిన గుండెపోటు.. ఆయువు తీయటం ఏంటీ అని చర్చించుకుంటున్నారు. దత్తాత్రేయకు పార్టీలకు అతీతంగా ఆప్తులు ఉన్నారు. సినీ ఇండస్ట్రీతోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలో.. ఆయన ఇంటికి ప్రముఖులు పోటెత్తారు. వైష్ణవ్ కు నివాళులు అర్పిస్తున్నారు. దత్తాత్రేయ కుటుంబాన్ని ఓదార్చుతున్నారు. ఏ నిమిషానికి ఏమి జరుగునో.. ఎవరు ఊహించెదరు…

Posted in Uncategorized

Latest Updates