దళారులకు కాసుల వర్షం : పక్కదారి పడుతున్న గొర్రెల పంపిణీ పథకం

గొర్రెల పథకం  పక్కదారి పడుతోంది.  జీవనోపాధి  కోసం  ప్రభుత్వం  పెట్టిన పథకం..  దళారులకు  కాసులు కురిపిస్తుంది.  కొంత మంది  సబ్సిడీ  గొర్రెలను  పక్క రాష్ట్రాలకు  సప్లయ్ చేస్తే..  మరికొంత మంది  మటన్ షాప్ కు  బేరం  పెడుతున్నారు.

రాష్ట్రంలో గొల్ల, కుర్మల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకం తీసుకొచ్చింది. గ్రామస్థాయిలో అర్హులైన వారిని లక్కీడ్రాలో ఎంపిక చేసి.. గొర్రెల యూనిట్లు పంపిణీ చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. నల్లగొండ ఉమ్మడి జిల్లాలోని కొందరు లబ్దిదారులు సబ్సిడీ గొర్రెలను.. అక్రమంగా అమ్ముకుంటున్నారు. ఆంధ్రాకు చెందిన దళారులు వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ కొన్న గొర్రెలను ఇతర రాష్ట్రాలకు మళ్లించి.. మళ్లీ అవి కొన్నట్లుగా కాగితాలు సృష్టిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ దందా కోసం పక్క రాష్ట్రాల్లో ‘బోగస్  గొర్రెల పెంపకందారుల్ని’ సృష్టిస్తున్నారు. ఆ వ్యక్తి ఖాతాలో పడిన సొమ్మును.. దళారులు, పశువైద్యులు కలిపి పంచుకుంటున్నారు. గొర్రెల రీ-సైక్లింగ్  మాత్రమే కాదు.. పిల్ల గొర్రెలను కూడా దీంట్లో కలిపి ఒక్కో యూనిట్  కు 20 వేలకు పైగా దండుకుంటున్నారు. జిల్లాలోని మాడ్గులపల్లి, తిరుమలగిరి, దామరచర్ల, వాడపల్లి, నాగార్జున సాగర్, మునుగోడు, చండూర్, నాంపల్లి, కనగల్, మోత్కూర్, హాలియా పరిధిలో వందలాది గొర్రెల యూనిట్లు అక్రమంగా తరలించినట్లు తెలుస్తోంది. కొన్నిసార్లు పోలీసులు కూడా పట్టుకొన్నారు. ఇటీవల కాలంలోనే జిల్లాలో పదుల సంఖ్యలో కేసులు నమోదు అయ్యాయి.

యాదాద్రి-భువనగిరి జిల్లా నుంచి డీసీఎంలో అనంతపురానికి తరలిస్తున్న 90 గొర్ల వాహనాన్ని.. మానవపాడు మండలం జల్లాపురం దగ్గర్లో  ఆర్.టి.ఓ. అధికారులు పట్టుకున్నారు. రంగారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి అక్రమంగా తరలిస్తున్న గొర్రెలను.. ఉమ్మడి నల్లగొండ జిల్లా బోర్డర్ నుంచి పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారు.

సూర్యాపేట జిల్లాలోని ఆత్మకూర్(ఎస్) లోనూ సేమ్ సీన్. జిల్లాలోని ఏడు మండలాల నుంచి వందల సంఖ్యల్లో గొర్రెలను కోదాడ బార్డర్ చెక్ పోస్ట్ నుంచి ఆంధ్ర ప్రాంతం వైపు తరలిస్తుండగా చాలా సార్లు పట్టుపడ్డారు. యాదగిరిగుట్టలో మటన్ మార్కెట్లకు ప్రభుత్వ సబ్సిడీ గొర్రెలు తరలించి.. సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 

 

Posted in Uncategorized

Latest Updates