దళిత భక్తుడికి ఆలయప్రవేశం : భుజాలపై మోసిన ప్రధాన అర్చకుడు

DALITHA Sమనుషులంతా ఒక్కటేనని తెలుపుతూ తెలంగాణలోని ప్రతి దేవాలయంలో మునివాహన సేవా కార్యక్రమాన్ని చేపట్టాలని పిలుపునిచ్చారు రాష్ట్ర దేవాలయాల పరిరక్షణ కమిటీ చైర్మన్, చిలుకూరి బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకుడు సీఎస్‌ రంగరాజన్‌. సోమవారం (ఏప్రిల్-16)జియాగూడలోని చరిత్రాత్మక రంగనాథస్వామి దేవాలయంలో మునివాహన సేవా మహోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన దళిత భక్తుడు, దేవీ ఉపాసకుడు ఆదిత్య పరాశ్రీకి ఆలయ ప్రవేశం కల్పించారు. ఆయనను రంగరాజన్‌ భుజాలపై ఎత్తుకొని మండపం నుండి ప్రధాన ధ్వజస్థంభం వరకు తీసుకెళ్లారు. ప్రదక్షిణ అనంతరం ఆలయంలోకి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు, మంగళహారతులు నిర్వహించారు. శిరస్సుపై శఠగోపం ధరింపచేసి ఆశీర్వదించారు.

అనంతరం జరిగిన సమావేశంలో రంగరాజన్‌ మాట్లాడుతూ.. 2 వేల 700 ఏళ్ల నాటి లోకసారంగముని స్ఫూర్తితో రంగనాథస్వామి ఆలయంలో మునివాహన సేవా కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. కుల ఆధారిత సమాజంలో దళితులు నేటికీ అనేక రకాలుగా వివక్ష ఎదుర్కొంటున్నారని విచారం వ్యక్తం చేశారు. దళితులపట్ల వివక్షను తొలగించడానికి, సమానత్వాన్ని చాటడానికే దళిత భక్తుణ్ని భుజస్కంధాలపై మోసుకుంటూ ఆలయ ప్రవేశం చేశామన్నారు. ఇది అంకురార్పణ మాత్రమేనని చెప్పారు. దళితులు ఆలయ ప్రవేశం చేయడంతోపాటు హైందవ సంస్కృతి, సంప్రదాయాలు తెలుసుకోవాలన్నారు. దళితులపై దాడులు జరుగకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు.

పూర్వం తమ ఊళ్లోని ఆంజనేయస్వామి దేవాలయంలోకి తమను అనుమతించేవారు కాదని ఆదిత్య పరాశ్రీ తెలిపారు. తాను జంధ్యం వేసుకుని వేదాలను ఆచరించాలన్న సంకల్పంతో మహారాష్ట్రలోని సిద్ధేశ్వరస్వామిని ఆశ్రయించి జ్ఞానసాధన చేశానని చెప్పారు. స్వగ్రామంలో చిన్న ఆశ్రమం ఏర్పాటుకు ప్రభుత్వం సహాయం చేయాలని కోరారు.

Posted in Uncategorized

Latest Updates