దావూద్, చోటా షకీల్, మాల్యా లాంటోడు రేవంత్ రెడ్డి.. బాల్క సుమన్

హైదరాబాద్ : కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి, ఆయన బంధువులు, ఆయన కంపెనీలపై జరుగుతున్న ఐటీ దాడులకు.. టీఆర్ఎస్ కు ఎలాంటి సంబంధం లేదన్నారు ఆ పార్టీ నేత ఎంపీ బాల్క సుమన్. దాడులకు టీఆర్ఎస్ కు సంబంధం వుందని కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలను బాల్క సుమన్ తప్పుపట్టారు. కాంగ్రెస్ నేతలు దొంగే దొంగ అని అరుస్తున్నట్లు ఉంది అని విమర్శించారు.

ఆదాయపు పన్నుశాఖ కేంద్రం పరిధిలో ఉంటుందని.. ఆర్థిక నేరగాళ్లపైనే ఐటీ అధికారులు దృష్టిపెడతారని అన్నారు బాల్కసుమన్. నలభై ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న జానారెడ్డి ఇళ్లపైన ఐటీ అధికారులు దాడులు చేయడం లేదు కదా అని అన్నారు సుమన్. తెలంగాణ తులసీవనంలో రేవంత్ రెడ్డి గంజాయి మొక్క లాంటివాడని.. సెటిల్మెంట్లు, భూ కబ్జాలకు కేరాఫ్ గా రేవంత్ రెడ్డి మారారని అన్నారు బాల్కసుమన్. ఒకే అడ్రస్ పై 18 కంపెనీలను పెట్టి.. అక్రమ వ్యాపారాలు చేయటం న్యాయమా కాదా.. కాంగ్రెస్ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు బాల్కసుమన్.

రేవంత్ రెడ్డి ఒక చోటా షకీల్, ఒక విజయ మాల్య, ఒక దావూద్ ఇబ్రహీం లాంటి వాడని అన్నారు. 2009 ఎలక్షన్ అఫిడవిట్ లో రూ.3.6 కోట్లు, 2014 లో అఫిడవిట్ లో రూ.13.2 కోట్లు చూపించారు. ఇప్పుడు ఇవన్ని ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పాలన్నారు. రేవంత్ రెడ్డి దేశ ద్రోహి.. ఐటీకి సంపాదన చూపించకుండా దేశాన్ని మోసం చేశారని అన్నారు. ఇలాంటి దేశ ద్రోహి ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ఈ సమాజంలోనే వుండటం కరెక్ట్ కాదనీ.. జైలులో ఉంచాలని ఈ ఆపరేషన్ చేస్తున్న అధికారులను కోరుతున్నా అన్నారు బాల్క సుమన్.

నారాయణ్ గూడలో మామూలు పెయింటర్ రేవంత్ రెడ్డి ఇన్ని కోట్లు ఎలా సంపాదించారో ప్రజలకు చెప్పాలన్నారు.  మిలట్రీలో పని చేసిన ఉత్తమ్ మనీ లాండరింగ్ చేసిన రేవంత్ కి ఎలా మద్దతు తెలుపుతారని ప్రశ్నించారు బాల్కసుమన్.

Posted in Uncategorized

Latest Updates