దిష్టిబొమ్మలు అయ్యారా : పొలాల్లో మోడీ, షా భారీ కటౌట్లు

కర్నాటక పలెల్లో ఇప్పుడు చూస్తున్నది పంటను కాదు.. పెద్ద పెద్ద దిష్టిబొమ్మలను. అవును.. అవి మామూలు బొమ్మలు అయితే ఎవరూ పట్టించుకోనక్కర్లేదు.. దేశ ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కటౌట్లు కావటంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. అవి కూడా పెద్ద పెద్ద కటౌట్లు.. ఎన్నికల సభలు, సమావేశాల్లో ఉపయోగించేవి కావటం విశేషం.. ఇంత పెద్ద పెద్ద బొమ్మలు రైతులు పొలాల్లో ఎందుకు పెట్టుకున్నారు.. ఎక్కడి నుంచి వచ్చాయి అనేది తెలిస్తే షాక్ అవుతారు.

రెండు నెలల క్రితం కర్నాటకలో ఎన్నికలు పూర్తయ్యి.. ప్రభుత్వం ఏర్పడింది. మిగతా పార్టీలతో పోల్చితే బీజేపీ హోరాహోరీ ప్రచారం చేసింది. మోడీ ర్యాలీలు, బహిరంగ సభలు ఎక్కువ స్థాయిలో జరిగాయి. హుబ్లీ ఏరియాలో అయితే బూత్ స్థాయి నుంచే మోడీ, అమిత్ షా భారీ కటౌట్లు గ్రామ గ్రామాన ఏర్పాటు చేశారు. ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు ఆ కటౌట్లను రైతులు.. తమ పొలాల్లో ఏర్పాటు చేసుకున్నారు. హుబ్లీలోని చాలా పొలాల్లో ఇప్పుడు ఈ కటౌట్లు దర్శనం ఇస్తున్నాయి. వర్షాలు బాగా పడటంతో పంటల దిగుబడి బాగుంది. ప్రజల దృష్టి పంటపై పడకుండా.. వారి చూపు మరల్చేందుకు మోడీ, అమిత్ షా కటౌట్లు పెట్టుకున్నట్లు చెబుతున్నారు రైతులు. దీనికితోడు పిట్టలు, పశువులు పంటను నాశనం చేయకుండా ఉండేందుకు ఇలా ఏర్పాటు చేశామని చెబుతున్నారు.

హుబ్లీ ఏరియాలోని తారేకేర్ తాలూకా లక్కవల్లి గ్రామంలోని పొలాల్లో ఈ కటౌట్లను విరివిగా వాడుకుంటున్నారు. అక్కడక్కడ యడ్యూరప్ప బొమ్మలు కూడా ఉన్నాయి. వీరితోపాటు స్థానిక నేతలు కటౌట్లు కూడా దర్శనం ఇవ్వటం విశేషం. ఈ కటౌట్లను చెక్క, ప్లేవుడ్ తో తయారు చేయటంతో చాలా కాలం మన్నికగా ఉంటాయని కూడా చెబుతున్నారు రైతులు. ఎటూ గ్రామాల్లో ఇవి ఊరికే పడి ఉన్నాయని.. వాటిని ఈ విధంగా పొలాల్లో వాడుకుంటున్నామని చెబుతున్నారు అన్నదాతలు. నేతల బొమ్మలు వేస్ట్ కాకుండా.. రైతులకు ఈ విధంగా ఉపయోగపడటం మంచిదే కదా అంటున్నారు రైతులు.

Posted in Uncategorized

Latest Updates