దీపావళికి ఎన్టీఆర్ విష్ణుచక్ర.. సీబీఎన్ లక్ష్మీ ఆటంబాంబ్.. వర్మ ఓపెన్ ఛాలెంజ్

ఇంటర్నెట్ న్యూస్ : తాను తీసే సినిమాలకు ప్రమోషన్ సంపాదించడంలో రామ్ గోపాల్ వర్మ స్టైలేవేరు. లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో ‘ఎన్టీఆర్ ట్రూ స్టోరీ’ తీస్తున్నానంటూ ఆయన తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. దీనికి సంబంధించిన ఓ నాలుగు నిమిషాల వీడియోను తన సోషల్ అకౌంట్లలో షేర్ చేశారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ పై తన ఆలోచనలు, ఐడియా, కథాంశం, గురించి అందులో సూటిగా చెప్పేశారు. పోస్టర్లను ఇంట్రస్టింగ్ పేర్లతో విడుదల చేయబోతున్నానని క్లారిటీ ఇచ్చేశాడు.

ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశం తర్వాత ఉద్భవించిన కొన్ని అత్యంత కీలకమైన విపత్కర పరిణామాలే ఈ సినిమా అన్నారు వర్మ. ఇది ఒక జీవిత సత్యాన్ని చెరపటానికి చచ్చేంత ప్రయత్నం చేసినా చెరపలేకుండా చేయటానికి కెమెరాతో వేయబోతున్న అతి కచ్చితమైన ఒక రౌద్ర ముద్ర అని తన స్టైల్లో చెప్పారు.

“అందరి అభిప్రాయాలు తీసుకుని.. ఎన్టీఆర్ జీవితంలో కళ్లు బైర్లు కమ్మేనిజాన్ని లోతుగా తవ్వి బయటకు తీశాను. టైటిల్ ను బట్టి అర్థంచేసుకోండి.. ఆవిడది చాలా ముఖ్యపాత్ర. ఎన్టీఆర్ పైన తనకు ఉన్న హిమాలయ పర్వతమంత గౌరవంతోనే నాస్తికుడైన నేను.. తిరుపతిలో దర్శనంచేసుకుని ప్రెస్ మీట్ పెట్టాను. నిరూపించగలిగే నిజాల పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే సినిమా ఉంటుంది. జనవరి 24న విడుదల కానున్న ఈ సినిమా వెనుక ఎటువంటి రాజకీయ ఉద్దేశాలు లేవని చెప్పినా నమ్మరు కాబట్టి చెప్పను. కానీ ఉన్నాయని చెప్పి.. లేనివి కల్పించి నిజమని ఒప్పించబోనని ఎన్టీఆర్ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. లక్ష్మీస్ ఎన్టీఆర్ కు మాత్రమే ఎన్టీఆర్ ఆశీస్సులు ఉంటాయని చెప్పగలను. ఇది నా ఓపెన్ ఛాలెంజ్” అని వీడియోలో చెప్పారు వర్మ.

వీడియోతో పాటు పెట్టిన కామెంట్ కూడా ఇండస్ట్రీలో బాగా వైరల్ అవుతోంది. దీపావళికి లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ విడుదల చేస్తా అన్నారు. ఆ ఫస్ట్ లుక్ ను.. ఎన్టీఆర్ విష్ణుచక్ర, సీబీఎన్ లక్ష్మీ ఆటంబాంబ్ పేర్లతో ఫస్ట్ లుక్స్ విడుదల చేస్తామని చెప్పి ఆసక్తి పెంచారు వర్మ.

Posted in Uncategorized

Latest Updates