దుకాణం సర్దేసిన కంపెనీ : HTC స్మార్ట్ ఫోన్లు బంద్

ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ నుంచి ఓ కంపెనీ మాయం కాబోతున్నది. అదే తైవాన్ మొబైల్ తయారీ కంపెనీ అయిన htc. నాణ్యత, క్వాలిటీ విషయంలో మంచి పేరున్న htc స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు ఇటీవల కాలంలో భారీగా తగ్గాయి. చైనా నుంచి వస్తున్న ఎంఐ (రెడ్ మీ) నుంచి పోటీ తట్టుకోలేకపోతున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీ తయారీ యూనిట్లను మూసివేస్తూ ఉన్నది. ఇప్పటికే భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగింపును చేపట్టింది. ఇప్పుడు ఏకంగా అమ్మకాలను కూడా బంద్ చేయాలని నిర్ణయించింది ఈ కంపెనీ.

భారతదేశం హెడ్ సిద్ధిఖీ, సేల్స్ హెడ్ విజయ్ బాలచంద్రన్, ప్రాడక్ట్ హెడ్ ఆర్.నయ్యర్ ముగ్గురూ ఒకేసారి రాజీనామా చేశారు. వీరితోపాటు కంపెనీ చీఫ్ ఫైనాన్షియర్ అయిన రాజీవ్ దయాల్ ను వెళ్లిపొమ్మని కంపెనీ ఆదేశించినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఏడాది కాలంగా htc స్మార్ట్ ఫోన్ల తయారీని కూడా నిలిపివేసింది కంపెనీ. అదే విధంగా ఇండియాలో వర్క్ చేస్తున్న టాప్ 70 ఉద్యోగులకు సెటిల్ మెంట్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రీమియం స్మార్ట్ ఫోన్ల తయారీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న htc.. చైనా కంపెనీల నుంచి వస్తున్న పోటీని తట్టుకుని నిలబడలేకపోయింది. మూడు, నాలుగేళ్లుగా నష్టాల్లో ఉన్న కంపెనీని ఇక గట్టెక్కించలేం అని నిర్ణయానికి వచ్చిన తర్వాత.. మొత్తం కంపెనీని సర్దేయాలని డిసైడ్ అయ్యింది యాజమాన్యం. ఇందులో భాగంగా ప్రస్తుతానికి సేల్స్ కూడా నిలిపివేయాలని నిర్ణయించింది.

మొత్తం లావాదేవీలు కంప్లీట్ అయిన తర్వాత.. ఆన్ లైన్ ద్వారా సేల్స్ ప్రారంభించాలని నిర్ణయించింది కంపెనీ. అది కూడా తైవాన్ నుంచే ఆపరేట్ చేయబోతుంది. దీనికి మరికొంత సమయం పడుతుందని.. ప్రస్తుత వ్యవహారాలు అన్నీ చక్కదిద్దిన తర్వాత ఆన్ లైన్ ద్వారా అమ్మకాలు చేపడతామని తెలిపింది కంపెనీ. మొత్తానికి చైనా స్మార్ట్ ఫోన్ల దెబ్బకి.. ఓ మంచి బ్రాండెడ్ కంపెనీ మూతబడింది. చైనానా.. మజాకా..

Posted in Uncategorized

Latest Updates