చైనాను దాటేసింది : దూసుకెళ్తున్న భారత GDP

GDPభారత GDP జోరు పెరిగింది. గత ఆర్థికసంవత్సరంలో మూడు క్వార్టర్ లలో కాస్త అటూ ఇటుగా ఉన్నా.. నాలుగో క్వార్టర్ లో రికార్డ్ క్రియేట్ చేసింది. 7.7 శాతం వృద్ధితో చైనా గ్రోత్ రేట్ ను దాటిపోయింది. ఇదే అసలైన అభివృద్ధి అని కేంద్రం చెప్పుకుంటోంటే.. లెక్కలను నమ్మలేమంటోంది కాంగ్రెస్. భారత జీడీపీ దూసుకెళ్తోంది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి 7.7 శాతంగా నమోదైంది.

నోట్ల రద్దు, GST అమలు తర్వాత ఈ స్థాయిలో GDP నమోదుకావటం ఇదే మొదటిసారి. ఇది గత ఏడు త్రైమాసికాల కంటే ఎక్కువ. తయారీ, నిర్మాణ, సేవారంగాల దూకుడుతోనే ఇది సాధ్యమైందని ఆర్థికశాఖ అధికారులు చెబుతున్నారు. 7.7 శాతంతో అత్యంత వేగవంతమైన GDP కలిగిన దేశంగా భారత్ నిలిచింది. చైనా వృద్ధిరేటు 6.8 శాతంగా ఉండగా.. భారత్ మరో శాతం ముందుకు దూసుకెళ్లింది.

తలసరి ఆదాయం కూడా 8.6 శాతం పెరిగినట్టు ఆర్థికశాఖ ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం మొత్తంగా చూస్తే దేశ GDP లెక్కలు నాలుగేళ్ల కనిష్టాన్ని తాకాయి. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 7.1 శాతంగా ఉన్న వృద్ధి రేటు.. ఈ ఆర్థిక సంవత్సరానికి వచ్చే సరికి 6.7 శాతానికి పడిపోయింది. భారత దేశ GDP క్రమంగా పెరుగుతోందన్నారు ఆర్థికశాఖ ఇంచార్జ్ మంత్రి పీయూష్ గోయల్. ఆర్థికవ్యవస్థ సరైన దిశలోనే వెళ్తోందనడానికి ఇదే నిదర్శనమన్నారు. ఇదే నిజమైన అభివృద్ధి అన్న ఆయన.. భవిష్యత్ లో మరింత వృద్ధి ఉంటుందన్నారు. కేంద్రం చెప్పిన లెక్కలు నమ్మశక్యంగా లేవన్నారు కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్. GST, నోట్లరద్దు, పెట్రోల్ ధరల పెరుగుదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. ఇలాంటి పరిస్థితుల్లో GDP ఎలా పెరిగిందని ప్రశ్నించారు. GDP స్థాయి పెరగడంపై ప్రధాని మోడీ, BJP చీఫ్ అమిత్ షా సంతోషం వ్యక్తంచేశారు. కేంద్రమంత్రివర్గాన్ని అభినందించారు.

Posted in Uncategorized

Latest Updates