దేశంలోనే ఫస్ట్… శంషాబాద్ లో మానవ రహిత విమాన తయారీ కేంద్రం

హైదరాబాద్:  అదానీ డిఫెన్స్ & ఏరోస్పేస్, ఇజ్రాయిల్ కు చెందిన ఎల్బిట్ భాగస్వామ్యంతో భారత్ లో మొట్టమొదటిసారిగా ఏరోస్పేస్ పార్క్ ను శంషాబాద్ సమీపంలో ఏర్పాటుచేసింది. ఇక్కడ పైలెట్‌‌ అవసరంలేని  అన్ మ్యాన్డ్ ఏరియల్ వెహికిల్ (యుఏవి) మాన్యుఫాక్చరింగ్  కేంద్రాన్ని రాష్ట్ర హోం శాఖ మంత్రి  మహమూద్ అలీ ప్రారంభించారు. పైలెట్‌‌ అవసరంలేని ఈ ఏరియల్ విమానాల ద్వారా బార్డర్ లో అక్రమ చొరబాట్లను నిరంతరం గమనిస్తూ ఉండొచ్చని, దేశ రక్షణ కు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని అదాని ఎంటర్ ప్రైజ్ లిమిటెడ్  డైరెక్టర్ ప్రణవ్ అదాని తెలిపారు.

ఇండియా ఇజ్రాయిల్ ల మధ్య ద్వైపాక్షిక  సంబంధాల్లో ఈ ఒప్పందం అత్యంత కీలకమైందని అన్నారు. హర్మెస్ 900 మీడియం అల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ యుఏవిని ఇజ్రాయిల్ బయట తయారు చేస్తున్నది కేవలం ఇండియాలోనేనని అన్నారు. గత ఏడాది డల్లాస్ లో జరిగిన ఎకనమిక్  ఫోరం లో కేటీఆర్ ను కలిసానని, ఇక్కడ ఏరోస్పేస్ పార్క్ ఏర్పాటు గురించి చర్చించినట్లు ప్రణవ్ తెలిపారు. వెంటవెంటనే పర్మిషన్స్ లభించాయని అన్నారు. పర్మిషన్స్ వచ్చిన 9 నెలల్లోనే ఏరోస్పేస్ పార్క్ నిర్మాణం పూర్తయిందని చెప్పారు.

ప్రపంచ స్థాయి టెక్నాలజీ

50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ పార్క్ కు సుమారు రూ.108 కోట్ల (15 మిలియన్ డాలర్లు) పెట్టుబడి పెట్టినట్లు అదాని డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ హెడ్ ఆశిష్ రాజ్‌‌‌‌ వన్షి తెలిపారు. అదానీ ఎల్బిట్ పార్క్ లో హర్మెస్ 900, హర్మెస్ 450 కార్బన్  కాంపోజిట్ ఏరో  స్ట్రక్చర్ పూర్తి ఉత్పత్తి సామర్థ్యంతో పాటు ప్రపంచ మార్కెట్ అవసరాలకు తగిన రీతిలో తీర్చిదిద్దినట్లు చెప్పారు. యుఏవి అసెంబ్లింగ్ తో పాటు ఇంటిగ్రేషన్ సామర్థ్యం కూడా ఉందన్నారు. మార్చి నాటికి మొదటి యుఏవి పూర్తవుతుందని, ఇజ్రాయిల్ లో అసెంబ్లింగ్ పూర్తయిన తర్వాత పలు దేశాలకు ఎగుమతి చేస్తామని అన్నారు. 2020 నాటికి 18 వాహనాల తయారీ పూర్తవుతుందని తెలిపారు. ఇండియాలో ప్రభుత్వం టెండర్లు పిలిస్తే, ఇక్కడ కూడా సేవలు అందిస్తామని చెప్పారు. ఇండియా రక్షణ రంగం పూర్తిగా అమెరికా లాంటి దేశాలపై ఆధారపడకుండా ఇలాంటివి ఎంతగానో  దోహదపడతాయని అన్నారు. ఈ భాగస్వామ్యంలో అదానికి 51 శాతం వాటా ఉండగా, ఎల్బిట్ కు 49 శాతం వాటా ఉంది.

హర్మెస్ 900

దేశ రక్షణ లో హర్మెస్ 900 పాత్ర చాలా ముఖ్యమైంది. ఏరియల్ ద్వారా దేశ బార్డర్ చుట్టూ నిరంతరం గస్తీ కాస్తూ అక్రమంగా చొరబడుతున్న వారిని గుర్తిస్తుంది. 36 గంటల పాటు ఏకధాటిగా ప్రయాణించే సామర్థ్యం ఉన్న హర్మెస్ 900, 30 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుంది. ఇది 450 కిలోల బరువును మోయ గలుగుతుంది. హర్మెస్ 900 ను 15 దేశాల్లో వినియోగిస్తుండగా, దీనికి యుకే తమ ప్రధాన కస్టమర్ అని ఎల్బిట్ సిస్టమ్స్ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బెజ్ లీల్ మెక్లిస్ తెలిపారు. తమ మొత్తం రెవెన్యూలో 80 శాతం అంతర్జాతీయ మార్కెట్ల నుంచే లభ్యమవుతోందని, తమకు యూఎస్ ప్రధాన మార్కెట్ అని ఆయన అన్నారు.

Posted in Uncategorized

Latest Updates